ఆరంభం నుంచి అంతం వరకూ
ఒకటే గోల ఒకటే లీల ఒకటే జోల
ఎక్కడెక్కడో చిందరవందరైన
అక్షరాలన్నీ ఏరుకొని
ఒక్కొక్కటి పేర్చడానికే సరిపోయింది
ఇక శాలవాల తప్పెట్లు
ఊరేగింపుల ఏవగింపులు
అన్నీ మనమే చేయాలి
అన్నీ మనమే రాయాలి
భావాన్ని మనమే మోయాలి
సమస్తం మనమే భరించాలి
ఆహా ఓహౌలతోనే
కాలం మొత్తం దొబ్బేసి
ఆకుల్లేని చెట్టుకింద తొంగోవాలి
పదవులన్నీ పద్యాలుగా మలిచి
మన రాగం మనమే తీసుకోవాలి
ఏంటో మరి
అంతా జరిగిపోయినట్టే వుంటది
ఏమీ కదలనట్టే ఆగిపోతాది
గొడవల గొడుగును
మాటిమాటికీ ఎత్తుతూనే
వడగళ్ల దాడిని ఖండించాలి
కడుపు కాలే కథలన్నింటినీ
కంచికి పంపిస్తూనే
కారణం లేని వాక్యాలకు
పురుడు పోసి బ్రతికించాలి
ఏంటో మరి
అంతా వున్నట్టే భ్రమిస్తూ
శూన్యంలో కలిసిపోవాలి
రాజకీయమైనా
ప్రేమాయణమైనా
సవాళ్ల సవారీ చేస్తూనే
చివరి మైలు రాయి వరకు
పరిగెత్తి విశ్రాంతి తీసుకోవాలి
ఏంటో మరి…!!
– నరెద్దుల రాజారెడ్డి
9666016636