పదేండ్లు ఏం చేశారు?

పదేండ్లు ఏం చేశారు?–  హరీశ్‌ రావుకు బండ్ల గణేష్‌ సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పాలనలో వంద రోజుల్లో పప్పులుడకలేదని కామెంట్‌ చేస్తున్న మాజీ మంత్రి హరీశ్‌ రావు పదేండ్లుగా రాష్ట్రానికి రావాల్సిన హామీల సాధనకు ఏం చేశారు? అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బండ్ల గణేష్‌ ప్రశ్నించారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌ ఈర్ష తారాస్థాయికి చేరిందని విమర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డి అవినీతి అధికారులను తప్పించి నిజాయితీ అధికారులను నియమించుకుని పాలన చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా పాలనలో కాంగ్రెస్‌ దూసుకుపోతోందని చెప్పారు.
అవినీతి అంతా బయటికి తీస్తాం
బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అవినీతి అంతటిని బయిటికి తీస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు నేరెళ్ల శారద హెచ్చరించారు. నెల రోజుల నుంచి అక్రమ సంపాదన ఆగిపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సాగునీటి పారుదల శాఖ బాగోతాలపై ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. పదేండ్లలో ఒక్కరికైనా రేషన్‌ కార్డు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
సారూప్యత కోరుకోవడంలో తప్పేముంది?
33 జిల్లాల్లో సారూప్యత ఉండే విధంగా చూస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన దాంట్లో తప్పేముందని కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షులు నిరంజన్‌ ప్రశ్నించారు. సిట్టింగ్‌లను మారిస్తే గెలిచేవారమనే భ్రమల్లో బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఉందన్నారు. కానీ, సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని అధికారం నుంచి దించేయాలని ప్రజలే నిర్ణయించుకున్నారని తెలిపారు.
తెలంగాణ పదాన్ని చెరిపేసింది….
తెలంగాణ పదాన్ని చెరిపేసింది మాజీ సీఎం కేసీఆరే అని ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఆయన నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పేరులో తెలంగాణను తొలగించిన వారే కాంగ్రెస్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. అవినీతిపై న్యాయవిచారణను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. సీబీఐ విచారణ కన్నా న్యాయవిచారణ గొప్పదని చెప్పారు. పారదర్శకత కోసమే న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించబోతోందని తెలిపారు. కవిత లిక్కర్‌ కేసును ఈడీ మరుగుపర్చిందని ఎద్దేవా చేశారు. అదే విధంగా కేసీఆర్‌ అవినీతిని మరుగు పరిచేందుకే సీబీఐ విచారణ కోరుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని జీవన్‌ రెడ్డి ఆరోపించారు. ఈఎన్సీ మురళీధర్‌ రావును తక్షణం బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.
కేసీఆర్‌ పాలనలో చోటు చేసుకున్న రూ.లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ఒక భాగం మాత్రమేననీ, యాదాద్రి, మిషన్‌ భగీరథలో రూ.50 వేల కోట్లకు మించి అవినీతి జరిగిందని ఆయన తెలిపారు. వీటన్నింటిపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.