– వరికి బదులు ఉద్యాన వంట సాగు పెంచాలని నిర్ణయం
– మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ హామీ
– రూ.250 కోట్లతో ప్రతిపాదనలు
– మూడేండ్లు కావస్తున్నా.. విడుదల కాని నిధులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తానన్న సీఎం కేసీఆర్ హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దాదాపు మూడేండ్లు గడుస్తున్నా.. ఆ వైపుగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. జిల్లా ఉద్యాన శాఖ రూ.250 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్కార్‌కు పంపింది. అయినా నేటికీ ఉద్యాన హబ్ అందుబాటులోకి రాలేదు. సీఎం కేసీఆర్ హామీ నీటి మూటగానే మిగిలిపోయిందని రైతులు అంటున్నారు.
అక్టోబర్ 29, 2020న హైదరాబాద్ నగర శివారు మూడుచింతలపల్లి మండల కేంద్రంలో ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శివారు ప్రాంతాన్ని ఉద్యాన హబ్‌గా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. వెంటనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దాంతో జిల్లా ఉద్యానశాఖ అధికారులు 2020 నవంబర్‌లో ఉద్యాన హబ్ ఏర్పాటుకు ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది. ఇది జరిగి దాదాపు మూడేండ్లు కావస్తోంది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ నెల 18వ తేదీన మేడ్చల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో ఉద్యాన హబ్‌పై సీఎం కేసీఆర్ ప్రసంగించకపోవడంతో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కదిలికలేకపోవడంతో నీలినీడలు అలుముకున్నాయాన్న ఆందోళ…
ఉద్యాన హబ్ ప్రతిపాదనలు ఇలా..
నగర శివారుల్లో 99 వేల ఎకరాల వ్యవసాయ (పంట సాగు) భూమి ఉంది. ఇందులో 12 వేల ఎకరాల్లో మాత్రమే ఉద్యానవన పంట సాగు చేస్తున్నారని, మరో 18 వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగు చేస్తున్నట్టు ప్రతిపాదనల్లో జిల్లా యంత్రాంగం వివరించింది. ప్రతి ఏటా 10 వేల ఎకరాల చొప్పున దశల వారీగా మూడేండ్లులో 30 వేల ఎకరాల్లో ఉద్యాన పంట సాగును పెంచేందుకు అవకాశముందని, ఇందు కోసం హార్టికల్చర్ శాఖలో ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బంది సంఖ్యకు అదనంగా ఏడుగురు హార్టికల్చర్ అధికారులు, 10 మంది హెచ్‌ఐఓ పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదనల్లో జిల్లా యంత్రాంగం పేర్కొంది. పట్టుమని ఐదు వేల ఎకరాల్లో కూడా అదనంగా ఉద్యానవన పంట సాగుకాలేదు. జిల్లా హార్టికల్చర్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయలేదు. రానున్న రోజుల్లోనైనా జిల్లాను ఉద్యాన హబ్‌గా అభివద్ధి చేసేందుకు తక్షణమే నిధుల విడుదల చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. అంతేకాదు, హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధికి నిధుల కొరత అడ్డంకిగా మారింది. దాదాపు రూ.250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా ఉన్నా.. నిధులు మాత్రం విడుదల కాకపోవడంతో ఉద్యాన హబ్‌కు బ్రేక్ పడింది.