– అనుకూలమంటూ 2018లో బీఆర్‌ఎస్ లేఖ
– ఇప్పుడూ అదే వైఖరితో ఉన్నారా..?
– జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం
– రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం
– ఓటమి భయంతోనే తెరపైకి వన్ నేషన్ -వన్ ఎలక్షన్ : రేవంత్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 2018లో జమిలీకి అనుకూలమంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి బీఆర్‌ఎస్ లేఖ రాసిందని గుర్తు చేశారు. రాష్ట్రాల హక్కులను హరించేందుకు బీజేపీ తీసుకొస్తున్న జమిలి ఎన్నికల పట్ల ఇప్పటికీ అదే వైఖరితో ఉన్నారో, లేదో ప్రజలకు చెప్పాలని కోరారు.బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్న కేసీఆర్… ఈ విషయంలో తమ పార్టీ వైఖరి ఏమిటో ప్రజలకు విస్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే బీజేపీకి అనుకూలమనుకోవాలా? అని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు.అనేక అంతర్గత సర్వేల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయని చెప్పారు. అందుకే ఓటమి భయంతో మోడీ ‘వన్ నేషన్-వన్‌ఎలక్షన్’ విధానానికి త్వరపడుతున్నారని ఆరోపించారు. ‘అవి అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారే అవకాశం ఉంది. అదే జరిగితే దక్షిణాది ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజార్టీ కావాలన్నారు. జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం కలుగుతుందని తెలిపారు. తిరిగి కేంద్రంలో అధికారానికి వచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని చెప్పారు. ఈ కుట్రను తాను ముందుగానే ఊహించి లోక్‌సభలో ప్రస్తావించినట్టు తెలిపారు. ప్రస్తుతం బీజేపీ మాయ మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పారు. ప్రధాని మోడీ, అమిత్‌షా 30 రోజులు కర్నాటకలో గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసినా బీజేపీ గెలవలేదన్నారు. పార్లమెంట్‌లో మణిపూర్ ఘటనపై ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. మోడీ నాయకత్వంలో దేశానికి భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నదనే సంకేతాలు వస్తున్నాయని చెప్పారు. సీ ఓటర్ సర్వే ప్రకారం రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ 38 శాతం, బీఆర్‌ఎస్ 31శాతం ఓట్లు మాత్రమే పొందే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమికి అవమానకర పరిస్థితి ఎదురవుతుందనే మోడీ సర్కారు భయపడుతున్నదని చెప్పారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎలాంటి మార్పులు తెచ్చినా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
బోయలకు ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్
బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తాంటూ కేసీఆర్ మాట తప్పారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాల్మీకి బోయలు రేవంత్‌ను కలిశారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఆనాడు నడిగడ్డలో పాదయాత్ర చేస్తే, బోయలు కేసీఆర్‌కు అండగా నిలబడ్డారన్నారు.2009లో మహబూబ్‌నగర్‌కు వలస వచ్చిన కేసీఆర్‌ను ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. కానీ 2014లో కేసీఆర్ బోయ భీముడిని ఎమ్మెల్సీ చేస్తానంటూ మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. పదేండ్లు అయినా కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు.అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ గద్వాల, అలంపూర్ నిర్వాసితులను ఆదుకోలేదని విమర్శించారు. ఆనాడు బంగ్లాలను బద్దలు కొట్టి…గట్టు భీమున్నీ ఎమ్మెల్యే చేసి మీ పౌరుషాన్ని చాటారని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వాల్మీకి బోయల అండ లేకుండా ఎవరూ గెలవలేరని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న 14 సీట్లలో కనీసం 12 గెలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడారు.
చేరికలు: కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్‌పేట్ మండలానికి చెందిన పలువురు నాయకులు ఆదివారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం, కడెం, ఉట్నూర్, ఇంద్రవెల్లికి చెందిన ఎంపీటీలు, మచ్చ పోసవ్వ, శంకరయ్య, కనక మోహన్, సర్పంచ్‌లు పెందుర్ లింగు, కొడప భీమ్రావు, వెట్టి గంగ జక్కు, కనక వామన్, కనక రాము తదితరులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.