రాష్ట్రానికి ఏ నైతికతతో వస్తున్నారు?

– పునర్విభజన హామీల అమలుపై సమాధానమివ్వాలి
– హామీల అమలుకు సీఎం ఒత్తిడి పెంచాలి
– నేడు, రేపు ప్రభావిత ప్రాంతాల్లో నిరసనలు : కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలుపై పీఎం నరేంద్రమోదీ సమాధానమివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఈ నెల 8న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌ మఖ్దూంభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రానికి ఏ నైతికతతో ప్రధాని వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆయన రాక సందర్భంగా విభజన హామీల ప్రభావిత ప్రాంతాలైన బయ్యారం, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో జులై 7, 8 తేదీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆ హామీల అమలు కోసం అన్ని పార్టీలను కలుపుకుని పీఎంపై, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీఎం కేసీఆర్‌ ను కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హౌదా కల్పించి నిధులివ్వాలని డిమాండ్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రాల కల్పతరువు సింగరేణిని ప్రయివేటుకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీజేపీని నిలువరించే క్రమంలో తుదమట్టుకు నిలబడాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. మనుగోడులో వామపక్షాలు లేకుంటే బీజేపీకి పూలబాటే అయ్యేదని గుర్తుచేశారు. అప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి అనేక మంది బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధపడ్డారనీ, రాజగోపాల్‌ రెడ్డి ఓటమితో అది ఆగిపోయిందని చెప్పారు. అప్పుడు గెలిచి ఉంటే తెలంగాణలో మరోలా ఉండేదనీ, ఆ ప్రభావం కర్ణాటకపైన పడి ఉండేదన్నారు. కానీ అది రివర్స్‌ చేయడంలో వామపక్షాలు కీలకపాత్ర పోషించాయని తెలిపారు. బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో స్థానం లేదని తేల్చిచెప్పారు.
58 జీవో ప్రకారం ఇండ్లస్థలాలకు వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. దళిత బంధును పారదర్శకంగా ఇవ్వాలని కోరారు. కనీసం 10 నుంచి 15 లక్షల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఇవ్వాలనీ, ఇందుకు కేంద్రం కూడా సహకరించాలని కోరారు. మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగులందరిని పర్మినెంట్‌ చేయాలనీ, ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, కాజీపేటలో భూములు అందుబాటులో ఉన్నప్పటికీ ఏర్పాటు చేయకుండా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని గుజరాత్‌, ఇంకో చోట ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, బాల నర్సింహా పాల్గొన్నారు.