– నిడమనూరులో 46.1 డిగ్రీల టెంపరేచర్
– చాలా జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
– రెడ్ అలర్ట్ జాబితాలో పలు జిల్లాలు
– వచ్చే వారం పాటు ఇదే పరిస్థితి!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భానుడు తన విశ్వరూపం చూపిస్తుండటంతో ‘ఒకటే ఎండ..ఒకటే ఉక్కపోత..అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే వణుకే.. బయటకెళ్లొద్దు..ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు’ అన్నట్టుగా పరిస్థితి ఉంది. చిన్నపనిమీద బయటికెళ్లి ఇంటికొచ్చేసరికి ప్రాణం కిందమీదవుతూ..ఏం ఎండలు రా బాబోరు అని అనలేకుండా ఉండలేని స్థితి వచ్చింది. ఈ వారంలో ఎండలు మరింత పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బీఅలర్ట్‌గా ఉండాల్సిందే. వరుసగా రెండోరోజూ నల్లగొండ జిల్లాలో ఉష్ణోగ్రత 46 డిగ్రీలకుపైగా నమోదైంది. ఆదివారం నాడు నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 46.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. చాలా ప్రాంతాల్లో ఆదివారం 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, తీవ్ర ఎండ, ఉక్కపోతతో చూపెడుతున్న దాని కంటే ఉష్ణోగ్రతలు ఒకటెండ్రు డిగ్రీలు అధికంగానే నమోదవుతున్నాయనే భావన కలుగుతున్నది.
రెడ్ అలర్ట్ జోన్‌లో నల్లగొండ, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాలున్నాయి. అయితే, ఆదివారం రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో అక్కడక్కడా వర్షం పడింది. ఆదివారం రాత్రి 10 గంటల వరకు 39 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో, కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా వాంకిడిలో అత్యధికంగా 2.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వాన పడింది.