గిరిజనుల అభివృద్ధి కోసం ఏం చేస్తారు?

What will be done for the development of tribals?–  పార్టీ ప్రణాళికల్లో ప్రకటించాలి : చర్చావేదికలో వక్తల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజనుల అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆయా పార్టీల ఎన్నికల ప్రణాళికలో ప్రకటించాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం,తెలంగాణ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ‘గిరిజన డిక్లరేషన్‌’పై తెలంగాణ గిరిజన సమాఖ్య అధ్యక్షులు ఆర్‌ అంజయ్య నాయక్‌, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్‌ అధ్యక్షతన చర్చావేదిక నిర్వహించారు. ‘డిక్లరేషన్‌ ముసాయిదా’ను తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాం నాయక్‌ చర్చకు పెట్టారు. గిరిజన మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ధనంజయ నాయక్‌, సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్‌ రాంబాబు నాయక్‌, ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం ఖమ్మం జిల్లా నాయకులు బస్కీ నాయక్‌, ప్రదేశ్‌ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రఘు, ఆల్‌ ఇండియా ట్రైబల్‌ జేఏసీ అధ్యక్షులు రవీందర్‌ నాయక్‌, ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు అమర్‌ సింగ్‌, గిరిజన సంఘం నాయకులు ఎం బాలు, రామ్‌ కుమార్‌, రఘు, తిరుపతి, గౌరీనాయక్‌, గిరిజన సమాఖ్య నాయకులు దేవీలాల్‌, శత్రు ,నారాయణ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నవంబర్‌ 30 న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలను ప్రకటిస్తాయని చెప్పారు. వీటిల్లో గిరిజనుల ప్రధాన డిమాండ్లను ఆయా పార్టీల ప్రణాళికల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులను విస్మరిస్తే తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఓట్ల సమయంలో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నాయని విమ ర్శించారు. అటువంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. గిరిజనులకు నేరుగా లబ్ధి జరిగే విధంగా అభివద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం, సమానత్వంతో కూడిన ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఆరునెల్లకే గిరిజ నులకు 12శాతం రిజర్వేషన్‌ పెంచుతామని చెప్పి, తొమ్మిదేండ్ల తర్వాత 10 శాతానికి పెంచినట్టు ప్రకటించినా..అవి అమలు కాలేదని విమర్శించారు. దీంతో విద్యా,ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపో యారని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినా ప్రత్యేక నిధులు ఇవ్వకపోవ డంతో సర్పంచ్‌లు అప్పుల పాలై ఇప్పటి వరకు 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలి పారు. 11 లక్షల ఎకరాలకు పోడుభుములకు హక్కుపత్రాలు ఇస్తామన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 4 లక్షల ఎకరాలకు మాత్రమే హక్కుపత్రాలిచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గిరిజన వ్యతిరేక విధానాలు అవలం భించినా ఆ పార్టీకి మద్దతు ఇచ్చి రాష్ట్రంలో గిరిజనులకు ద్రోహం చేసిందని ఆరోపించారు. విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఉన్నా కేంద్రంతో కొట్లాడి సాధించడంలో కాలయాపన చేసిందన్నారు.