– 2017 తర్వాత అతీగతీ లేదు
– కార్మికుల బతుకులపై ప్రతికూల ప్రభావం
– ఉలుకూ పలుకూ లేని మోడీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో కార్మికుల కనీస వేతనాలను సవరించే విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. చివరిసారిగా 2017లో కనీస వేతనాలను సవరించారు. ఆ తర్వాత ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు. 1948వ సంవత్సరపు కనీస వేతనాల చట్టం ప్రకారం వివిధ కేటగిరీల పనులు చేసే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలను నోటిఫై చేయవచ్చు. అయితే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతీయ స్థాయిలో కార్మికుల కనీస వేతనాలను సవరిస్తుంది. దాని కంటే తక్కువగా రాష్ట్రాలు కనీస వేతనాలను నిర్ణయించకూడదు.
కార్మిక మంత్రిత్వ శాఖ 2017 జూలైలో కార్మికుల కనీస వేతనాన్ని రోజుకు 176 రూపాయలుగా నిర్ణయించింది. ఆ తర్వాత దానిని సవరించే విషయమై ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఆరు సంవత్సరాల క్రితం నిర్ణయించిన కనీస వేతనాన్నే ఇప్పుడు కూడా ఇస్తుండడంతో బీడీల తయారీ, మొక్కలు నాటడం, అగరుబత్తీల తయారీ వంటి పనులు చేసే కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఈ రంగాలలో మహిళలే ఎక్కువగా పని చేస్తున్నారు. కార్మికుల కనీస వేతనాలను తరచూ సవరించాల్సిన అవసరం ఉన్నదని, రాష్ట్రాలు ఆ పని చేస్తుండగా కేంద్రం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆర్థికవేత్త ఒకరు తెలిపారు.
1970లో అప్పటి ప్రణాళికా సంఘం తయారు చేసిన దారిద్య్రరేఖ అంచనాలకు అనుగుణంగా రూపొందించిన ఫార్ములా ఆధారంగా జాతీయ స్థాయిలో సగటు కనీస వేతనాలను నిర్ణయిస్తున్నారు. ఓ వ్యక్తి ఖర్చు చేసే కేలరీలతో ముడిపెట్టి దారిద్య్రరేఖ అంచనాలు రూపొందిస్తారు. అయితే ఆరోగ్యం, విద్య, రవాణా, కమ్యూనికేషన్ వంటి వాటిపై పెట్టే ఖర్చుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. ప్రభుత్వం కనీస వేతనాలను నిర్ణయిస్తే అది ద్రవ్యోల్బణానికి సూచిక అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికుల అవసరాలు, అభిరుచులు కూడా మారుతుంటాయి. వాటికి తగినట్లుగానే ఖర్చు కూడా పెరుగుతుంది. అందువల్ల కనీస వేతనాన్ని నిర్ణయించేటప్పుడు ఈ విషయాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం మన దేశంలో కార్మికులు పొందుతున్న వేతనంలో (అసలైన వేతనం) కొనుగోలు శక్తి ప్రతికూల వృద్ధి నమోదు చేసింది. కనీస వేతనాలు పెరుగుతున్నప్పటికీ ఇలా జరగడం గమనార్హం. 2022 ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో పురుషుల కనీస వేతన రేటు 5.1%, మహిళల కనీస వేతన రేటు 7.5% పెరిగింది. వ్యవసాయేతర కార్యకలాపాలలో ఈ రేటు 4.7%, 3.7% చొప్పున పెరిగింది. అయితే ద్రవ్యోల్బణం పెరగడంతో వాస్తవంగా గ్రామీణ వేతనాలు తగ్గాయని ఆర్థిక సర్వే తెలిపింది.