– సీఎం ప్రకటించి ఆరు నెలలైనా అందని సాయం
– కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రైతుల రాస్తారోకో
– వెంటనే పరిహారం అందించాలి : రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి
నవతెలంగాణ – చొప్పదండి
పంట నష్టపరిహారంపై సీఎం కేసీఆర్ ప్రకటించి ఆరు నెలలు దాటినా అందలేదు.. నష్టపరిహారం ఇంకెప్పుడిస్తారు.. ఆరు నెలలైనా అందలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని గుమ్లాపూర్ ఎక్స్‌రోడ్ వద్ద శుక్రవారం రైతులు పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. వారికి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం, బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థి కొంకటి శేఖర్ మద్దతు తెలిపారు. చొప్పదండి సీఐ గోపతి రవీందర్, ఎస్‌ఐ ఉపేంద్రచారి సిబ్బందితో కలిసి ఘటన స్థలంలో మోహరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆరు నెలల కిందట చొప్పదండి మండలంలో వడగండ్ల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించి పదివేల పంట నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించగా, సర్వే చేసిన అధికారులు నివేదిక పంపించారని చెప్పారు. ఆరు నెలలు అవుతున్నా పరిహారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొప్పదండి మండల వ్యవసాయ అధికారి వి.వంశీకృష్ణ, సీఐ రవీందర్ రైతులతో మాట్లాడారు. అధికారులతో చర్చించి పరిహారం అందేలా చూస్తామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులకు రైతులకు మధ్య కొంత వాగ్వివాదం చోటుచేసుకుంది. రైతులు, నాయకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి, కనుమల్ల రాజశేఖర్, కళ్ళపెళ్లి అరవింద్, రైతు సంఘం నాయకులు గుర్రం రవీందర్‌రెడ్డి, నూనె శేఖర్, రాజన్నల తిరుపతి, సంబోజీ సునీల్, నెట్టు శ్రీనివాస్, పెద్ది వీరేశం, నూనె చందు, ఒగ్గు లింగయ్య, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.