నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మెన్‌ను ఎప్పుడు నియమిస్తారో నాలుగు వారాల్లోగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చేనెల 25కు వాయిదా వేసింది. కమిషన్‌కు చైర్మెన్‌ను వెంటనే నియమించేలా ఉత్తర్వులివ్వాలంటూ న్యాయవాది బాగ్లేకర్ ఆకాశ్ కుమార్ వేసిన పిల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారించింది. జస్టిస్ ఎంఎస్‌కే జైస్వాల్ పదవీ విరమణ చేశాక కమిషన్ చైర్మెన్‌గా ఎవరినీ నియమించలేదని పిటిషనర్ వాదించారు.
వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి
జీహెచ్‌ఎంసీ, మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు కమిటీలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. చట్ట ప్రకారం, రాజ్యాంగ అధికరణం ప్రకారం వార్డు కమిటీలను స్థానిక ప్రజలతో ఏర్పాటు చేయాలని, ఈ విధంగా చేయకుండా ప్రభుత్వం అధికారులతో వార్డు కార్యాలయాలను తెరుస్తోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసిం ది. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
ఆర్బీఐ గవర్నర్‌కు హైకోర్టు నోటీసు
ఏపీ కోఆపరేటివ్ మహేష్ బ్యాంక్ రోజు వారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఒక అధికారిని నియమించాలని ఏప్రిల్ 24న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్‌కు హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ఏపీ మహేశ్ కో ఆపరేటీవ్ అర్బన్ బ్యాంక్ షేర్‌హౌల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను జస్టిస్ భాస్కర్‌రెడ్డి విచారణ జరిపి ఆర్బీఐ గవర్నర్‌కు నోటీసులిచ్చారు. ఏపీ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులు, వాటాదారుల ప్రయోజనాలను రక్షించడంతోపాటు బ్యాంకు రోజువారీ లావాదేవీలను యధావిధిగా కొనసాగించేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు చేపట్టేలా గతంలో హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆర్బీఐ ఒక అధికారిని నియమించాలని ఆదేశిం చింది. ఈ ఉత్తర్వులను కావాలనే అమలు చేయలేదంటూ ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ షేర్ హౌల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. విచారణను హైకోర్టు వాయిదా వేసింది.