– ఇంకా సగానికి పైగా దక్కని మాఫీ
– పలు బ్యాంకులు, బ్రాంచీల్లో పైసా మాఫీ కాలేదు..
– డీఏవో ఆఫీస్ హెల్ప్‌సెంటర్‌కు రైతుల క్యూ..
– ప్రాసెస్‌లో ఉందని ఏవోల సమాధానం
– ఎన్నికలు సమీపిస్తుండటంతో రైతుల్లో ఆందోళన
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
రూ.లక్షలోపు పంట రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2018 ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రూ.లక్షలోపు రుణమాఫీ అన్న ప్రభుత్వం మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు దీన్ని సాగదీసింది. రైతును పరిగణలోకి తీసుకోకుండా కుటుంబం మొత్తానికి రూ.లక్ష మాఫీ చేసింది. అగ్రిగోల్డ్‌లోన్స్‌ను సైతం మాఫీ చేస్తామని నాడు ప్రకటించినా నేడు దాని ఊసే లేదు. కుటుంబం ప్రాతిపదికన సెప్టెంబర్ 16వ తేదీలోపు వందశాతం రుణమాఫీ ఇస్తామని గడువు పెట్టింది. కానీ నిర్దేశిత తేదీలోపు 25శాతం మంది రైతుల రుణాలు కూడా మాఫీ చేయలేకపోయింది. జాప్యానికి సాంకేతిక కారణాలను సాకుగా చూపుతోంది. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధార్‌కార్డు, బ్యాంకు పుస్తకాలు పట్టుకుని జిల్లా సమీకృత భవన సముదా యాల్లోని జిల్లా వ్యవసాయశాఖ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడి హెల్ప్‌డెస్క్‌లో వాకబు చేస్తే ప్రాసెస్‌లో ఉందనే సమాధానం వస్తుంది తప్ప.. మాఫీ కావడం లేదు. బ్యాంకులకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిణా మాలకు పొంతన లేకుండా ఉందని మండిపడు తున్నారు. ప్రభుత్వ గణాంకాలకు వాస్తవ పరిస్థితులకు కూడా పోలిక లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
సాంకేతిక సాకులు..
సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు అందాల్సిన డబ్బులు బ్యాంకుల నుంచి వెనక్కి వచ్చాయని మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ సమస్యల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. రుణమాఫీపై సందేహాలుంటే 040-23243667 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.12,617 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. తద్వారా 22.46 లక్షల మంది రైతులు లబ్ది పొందారంటోంది. ఇంకా 7.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,400 కోట్లు మాత్రమే జమ చేయాల్సి ఉందంటోంది. అర్హులైన ప్రతిరైతుకూ రుణమాఫీ అందుతుందని చెబుతోంది. గణాంకాలు బాగానే ఉన్నా క్షేత్రస్థాయి పరిశీలనలో దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకే వ్యక్తికి ఒకటికి మించి బ్యాంకుల్లో రుణాలు ఉంటే ఏ బ్యాంకులోది పరిగణలోకి తీసుకోవాలో ఇంత వరకూ స్పష్టం కాని పరిస్థితి. అర్బన్ బ్యాంకుల్లో క్రాప్‌లోన్ తీసుకున్న రైతుల పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. ఫ్యామిలీ గ్రూపింగ్ కూడా కష్టతరంగా మారింది. ఒక కుటుంబంలో నలుగురికి లోన్లు ఉంటే ఎవరి రుణాన్ని పరిగణలోకి తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సహకార సంఘాల్లో పంటరుణాలు తీసుకున్న కొందరు రైతుల లోన్ అకౌంట్ నంబర్లతో పాటు ఆల్ఫాబేట్స్‌ను కూడా జత చేశారు. అలా అంకెలకు ఇంగ్లీష్ అక్షరాలను జోడించి లోన్‌అకౌంట్ నంబర్ ఇచ్చినా మాఫీ వర్తించలేదు. ఖమ్మం జిల్లాలో పదికి పైగా సహకార సంఘాల్లో ఇంత వరకూ ఒక్కపైసా కూడా జమకాలేదు.
ఖమ్మం జిల్లాలో మాఫీ కటకట..
ఖమ్మం జిల్లాలో రుణమాఫీ కష్టంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 3.21 లక్షల మంది రైతులకు గాను ఇప్పటి వరకు 89,093 మంది రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. అంటే నూటికి 29 మంది రుణాలు మాత్రమే మాఫీ కాగా ఇంకా 70శాతం మందికి పైగా ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.2,430 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా రూ.374 కోట్లు మాత్రమే సోమవారం నాటికి మాఫీ అయ్యాయి. ఇంకా రూ.2,056 కోట్ల రుణాల మాఫీ కోసం 2.31 లక్షల మందికి పైగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రూ.50వేల నుంచి రూ.1.22 లక్షల మధ్య ఉన్న రైతుల రుణాల్లో రూ.లక్ష లోపు మాఫీ చేశారు.
మంత్రి ఇలాకాలో ‘గ్రామీణ బ్యాంకు’ రైతుల ఇక్కట్లు..
ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజరుకుమార్ నియోజకవర్గంలోని పాపటపల్లి, జీకే బంజర, వీఆర్ బంజర, చిమ్మపూడి గ్రామాల్లోని 1821 మంది రైతులు ఖమ్మం నగరంలోని ఏపీజీవీబీ బురహాన్‌పురం బ్రాంచీలో రూ.లక్షకు పైగా రుణం తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కేవలం 411 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. వారంరోజుల్లో ఎన్నికల కోడ్ వస్తే పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఒక్క బ్యాంకులోనే ఉన్నా మాఫీ చేయలేదు..
నాకు ఏపీజీవీబీ బ్యాంకులో రుణం ఉంది. రూ.లక్ష తీసుకుంటే అది రూ.2 లక్షలయింది. బ్యాంకు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్లించుకోవట్లేదు. వ్యవసాయా ధికారి కార్యాలయానికి వెళ్లమంటే కలెక్టరేట్‌కు వచ్చా. ప్రాసెస్‌లో ఉందని చెప్పారు. ఇప్పటి వరకు రూ.1.25 లక్షల లోపు ఉన్న రుణాల్లో రూ.లక్ష మాఫీ అయ్యాయంటున్నారు. రూ.2 లక్షల వరకు మరికొంత సమయం పడుతుందంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మాఫీ అవుతుందో లేదోనని భయంగా ఉంది.
– బాణోత్ లింగా, ఆరెకోడుతండా