వలస కూలీలు ఎటు వైపు….?

Where are the migrant workers?– శ్రామికవర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఆయా పార్టీల వెంపర్లాట
– తమ హక్కులు కాపాడే వారికే మద్దతంటున్న కార్మికులు
– ఆ నియోజకవర్గాల్లో వారి ఓట్లే కీలకం

పారిశ్రామికవాడలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఈ జిల్లాలో కార్మికులు పెద్ద మొత్తంలో ఉన్నారు. వలస కార్మికులూ ఎక్కువే. ప్రస్తుత ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకం కాను న్నాయి. జిల్లాలోని సుమారు ఐదారు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములు వీరి చేతుల్లోనే ఉన్నాయి. దాంతో శ్రామికవర్గ ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ఆయా రాజకీయ పార్టీలు వెంపర్లాడుతున్నాయి. అయితే, తాయిలాలకు తలొగ్గేది లేదని, తమ హక్కులను కాపాడే వారికే తమ మద్దతు ఉంటుందని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో కీలకంగా మారనున్న కార్మికులపై కథనం.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నికల్లో నెగ్గలాంటే ప్రతి ఓటూ కీలకమే. ఓటరును మచ్చిక చేసుకోవడానికి ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిశ్రమలకు కేంద్రంగా ఉండటంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో కార్మికుల ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కార్మికుల ఓట్లు ‘కీ’ రోల్‌గా మారనున్నాయి. రాజేందర్‌నగర్‌, శేరిలిగంపల్లి, షాద్‌నగర్‌, మహేశ్వరం, తాండూరు, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాల్లో వారి ఓట్లే ప్రభావం చూపనున్నాయి. రాజేందర్‌నగర్‌ నియోజకవర్గంలోని కాటేదాన్‌ పారిశ్రామికవాడలో పనిచేస్తున్న కార్మికులు అత్యధికులు వలస కార్మికులే. వలస కార్మికుల్లో 50 శాతం మంది స్థానికంగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించనున్నారు.
భవన నిర్మాణ రంగం కార్మికులు శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌లో ఎక్కువగా ఉన్నారు. భవన నిర్మాణ రంగంలో ఉత్తరప్రదేశ్‌, ఒడిషా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన కార్మికుల్లో ఎక్కువ మంది ఇక్కడే స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికుల్లో 40 శాతం మంది స్థానికంగా ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరితోపాటు ట్రాన్స్‌పోర్టు రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ ప్రాంతానికి వచ్చిన ఆటో కార్మికుల్లో ఎక్కువగా ఎల్‌బీనగర్‌, శేరిలిగంపల్లి ప్రాంతంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో వీరి ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
మహేశ్వరం, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఇండిస్టియల్‌ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు చాలా మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. మహేశ్వరంలో ఏరోస్పేస్‌లో పనిచేస్తున్న కార్మికుల్లో అత్యధికులు స్థానికంగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇక్కడే కాకుండా అమేజాన్‌, ఫ్యాబ్‌ సిటీలో ఉన్న వివిధ ఇండిస్టియల్‌ కార్మికులు ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపనున్నారు. షాద్‌నగర్‌లో వందలాది కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారు.
తాండూరు ప్రాంతం పరిశ్రమలకు అడ్డ.. ఇక్కడ ఏండ్ల కొద్దిగా పనిచేస్తున్న అంతర్రాష్ట్ర కార్మికులు స్థానికంగా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇక్కడ వీరి ఓట్లు 20 శాతం ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటీగా ఉండటంతో ఏ పార్టీకి సంబంధం లేని కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి. దాంతో రాజకీయ పార్టీలు కార్మికుల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నాయి. అయితే కార్మికులు ఎవరి పక్షం నిలబడతారో వేచి చూడాలి.