నిర్వాసితుల పక్షమా?… కాంట్రాక్టర్ల పక్షమా?

సిఎం జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలి : వి శ్రీనివాసరావు
రాజమహేంద్రవరం: క్లాస్‌ వార్‌లో నిర్వాసితుల పక్షమో? కాంట్రాక్టర్ల పక్షమో? ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్వాసితుల హక్కుల కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోరుకేక మహా పాదయాత్ర ఏడో రోజైన సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్‌.పురం, కూనవరం మండలాల్లో కొనసాగింది. జిల్లాలో యాత్ర పూర్తి చేసుకుని ఏలూరు జిల్లాలోకి ప్రవేశించే ముందు విఆర్‌.పురం మండలం రేఖపల్లి సెంటర్‌, రాజీవ్‌ గాంధీ సెంటర్‌, ధర్మతాళ్లగూడెం ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో నాయకులు మాట్లాడారు. తన ఇల్లు పూర్తిగా మునిగిపోయిందని, నెల రోజులపాటు మండల కార్యాలయంలో కుటుంబంతో తలదాచుకున్నామని, ఇప్పటికీ ఇంటిని పునర్నిర్మించుకోలేకపోయానని ధర్మతాళ్లగూడేనికి చెందిన వ్యవసాయ కార్మికుడు జల్ది వీరయ్య పాదయాత్ర బృందానికి తన కష్టాన్ని చెప్పుకున్నారు. ప్రభుత్వం కేవలం రూ.10 వేలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పూరిపాక పునర్నిర్మాణానికి రూ.50 వేలు ఖర్చవుతుందని తెలిపారు. అడవిలో కలప తెచ్చుకునేందుకు వెళ్తే, ఫారెస్ట్‌ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. అనంతరం కూనవరం బస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభకు వందలాది మంది పోలవరం నిర్వాసితులు హాజరయ్యారు. పార్టీ మండల కార్యదర్శి పాయం సీతారామయ్య అధ్యక్షత వహించారు.
ఈ సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పరిహారం కల్పించకుండా ప్రాజెక్టు నిర్మిస్తుండడంతో విలీన మండలాల్లోని సుమారు 193 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే నాలుగు మండలాలు పూర్తిగా జల సమాధి కానున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని తెలిపారు. ఢిల్లీ, కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
గతేడాది వరదల సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, వరద బాధితులకు సిపిఎం అండగా నిలిచిందని తెలిపారు. సిపిఐ మండల కార్యదర్శి దుర్గాప్రసాద్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు శ్రీమంతుల వెంకటరమణ తదితరులు సంఘీభావంగా మాట్లాడారు. పోరుకేక మహా పాదయాత్రలో పార్టీలకతీతంగా అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం విఆర్‌.పురం ఎంపిపి కారం లక్ష్మి, సిపిఎం కూనవరం వైస్‌ ఎంపిపి కొమరం పెంటయ్య, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సంతోష్‌ కుమార్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
స్మారక స్తూపాల వద్ద నివాళులు
పుచ్చలపల్లి సుందరయ్య, బండారు చంద్రరావు, బత్తుల భీష్మారావు, శ్యామల వెంకటరెడ్డి, పులి రామయ్య, బిఎస్‌.రామయ్య, మడివి ముకయ్య, మడకం పంతులు, మార్త శ్రీరామ్మూర్తి, బొప్పన భీమయ్య స్మారక స్తూపాలకు పాదయాత్ర బృందం నివాళ్లర్పించి ముందుకు సాగింది.
పాదయాత్ర రేఖపల్లిలో బయలుదేరిన కొద్దిసేపటికి టిడిపి నాయకులు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు తరలివచ్చి మద్దతు తెలిపారు.
రేఖపల్లి సెంటర్‌లో సంక్షేమ పరిషత్‌ నాయకులు వేటకాని మల్లయ్య, ఆదివాసీ సమితి నాయకులు పూనం వీరభద్రం, పాయం రవివర్మ, మానే నాగేశ్వరరావు, శబరి వంతెన వద్ద జనసేన పార్టీ కూనవరం మండల అధ్యక్షులు సాంబశివ, విఆర్‌.పురం మండల అధ్యక్షులు సాయికృష్ణ, కూనవరం సర్పంచ్‌ హేమంత్‌, యుటిఎఫ్‌ జిల్లా నాయకులు పి.కన్నారావు, నాగేశ్వరరావు, సుబ్బారావు, కూనవరం బస్టాండ్‌ సెంటర్‌లో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు శ్రీమంతుల వెంకటరమణ సంఘీభావం తెలిపి పాదయాత్ర వెంట నడిచారు. మహా పాదయాత్రకు ఎక్కడికక్కడ జనం ఎదురేగి ఘన స్వాగతం పలికారు.