నాడు వైట్‌ రేషన్‌కార్డు…

White ration card on...– నేడు వందల కోట్లు ఎలా వచ్చే?
– అన్నీ భూ కబ్జాలు,ఆక్రమణలే
– ఆలేరు ఎమ్మెల్యే భర్త మహేందర్‌రెడ్డిపై అయోధ్యరెడ్డి తీవ్ర విమర్శలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నాడు వైట్‌ రేషన్‌కార్డు…నేడు వందల కోట్లు ఎలా వచ్చాయని టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఆలేరు నియోజకవర్గంలో భూకబ్జాలు, ఆక్రమణలు చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీఎస్‌్‌ఐఐసీ కోసం తుర్కపల్లిలో భూ సేకరణ చేస్తున్నారని చెప్పారు. సర్వే నెంబర్‌ 72లో 155 ఎకరాల భూమి ఉంటే, 108 ఎకరాల భూమికి నోటిఫికేషన్‌ ఇచ్చారని తెలిపారు. .ఇందులో 93 ఎకరాలు మాత్రమే టీఎస్‌ఐఐసీకి తీసుకుందని చెప్పారు. మిగిలిన 15 ఎకరాల భూమి ఆలేరు ఎమ్మెల్యే సునితా మహేందర్‌రెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. మిగిలిన 15 ఎకరాల భూమిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 43 మంది రైతుల దగ్గర తీసుకున్న భూమికి ప్రభుత్వం ఇచ్చిన చెక్‌లు బౌన్స్‌ అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో బీఆర్‌ఎస్‌లో వణుకు మొదలైందన్నారు. ఆ భయంతోనే మంత్రి హరీశ్‌రావు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.