పోరు గడ్డలో… గెలుపెవరిదో….

In the battle... won...– నకిరేకల్‌లో 14 సార్లు ఎన్నికలు..
– ఏడుగురు ఎమ్మెల్యేలు
– 10 ఎన్నికల్లో ఎర్రజెండాదే గెలుపు
– 8 పర్యాయాలు సీపీఐ(ఎం)దే విజయం
– నియోజకవర్గాల పునర్విభజనతో మారిన నకిరేకల్‌ రాజకీయం
ఎర్రకోటగా పిలవబడే నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గం నేడు రంగులమయంగా మారింది. ఇక్కడ 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పదిసార్లు వామపక్ష అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో రెండుసార్లు పీడీఎఫ్‌, 8సార్లు సీపీఐ(ఎం), మూడుసార్లు కాంగ్రెస్‌, ఒకసారి బీఆర్‌ఎస్‌ గెలుపొందింది. ఇక్కడి నుంచి సీపీఐ(ఎం) తరపున ఎమ్మెల్యేలుగా నర్రా రాఘవరెడ్డి, నోముల నరసింహయ్య గెలిచారు. శాసనసభ పక్షనేతలుగా వ్యవహరించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నర్రా రాఘవరెడ్డి తనదైన వాగ్ధాటితో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు.
నవతెలంగాణ- నకిరేకల్‌
2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో నకిరేకల్‌లో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారాయి. నకిరేకల్‌, కేతేపల్లి, కట్టంగూర్‌, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాలతో 126 గ్రామపంచాయతీలు ఉన్న నియోజకవర్గంలో మూసీ ప్రాజెక్టు, చెరువుగట్టు రామలింగేశ్వర ఆలయం, 65వ, 565వ, 365వ నెంబర్ల జాతీయ రహదారులు, నార్కట్‌పల్లి- అద్దంకి రాష్ట్ర రహదారి విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఓటర్ల సంఖ్యలో నల్లగొండ జిల్లాలో నకిరేకల్‌ నియోజకవర్గం ద్వితీయ స్థానంలో ఉంది.
సీపీఐ(ఎం) రికార్డు విజయాలు
నియోజకవర్గంలో మొత్తం 14సార్లు ఎన్నికలు జరిగితే సీపీఐ(ఎం) 8సార్లు గెలిచింది. 1957లో పీడీఎఫ్‌ అభ్యర్థి ధర్మభిక్షం, 1962లో సీపీఐ నుంచి నంద్యాల శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. 1967లో నర్రా రాఘవ రెడ్డి, 1972లో కాంగ్రెస్‌ అభ్యర్థి మూసపాటి కమలమ్మ, ఆ తర్వాత 1977 నుంచి వరుసగా ఐదుసార్లు రాఘవ రెడ్డి సీపీఐ(ఎం) నుంచి గెలుపొంది 1999 వరకు ఎమ్మెల్యేగా, శాసనసభ పక్ష ఉపనేతగా, శాసనసభా పక్ష నేతగా పనిచేశారు. 1999 నుంచి 2009 వరకు నోముల నర్సింహయ్య రెండుసార్లు సీపీఐ(ఎం) ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నర్రా రాఘవరెడ్డి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించారు. ఏక కాలంలో నియోజకవర్గంలో 68 గ్రామా లకు విద్యుద్దీకరణ చేయించిన ఘనత రాఘవరెడ్డికి దక్కింది. నల్లగొండ జిల్లా ఎడారిగా మారుతుందని ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం కోసం ఆనాడు ఎన్టీఆర్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రూపకల్పన చేయడంలో నర్రా కీలక పాత్ర పోషించారు.
పునర్విభజనతో మార్పు..
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమ్యూ నిస్టులకు పట్టు ఉన్న శాలిగౌరారం మండలంతోపాటు తోపుచర్ల పిర్కా, తిప్పర్తి మండలంలోని కొన్ని గ్రామాలు తొలగించడం, కాంగ్రెస్‌కు బలమున్న మండలాలు కలవడంతో పార్టీల బలాబలాలు మారిపోయాయి. పునర్విభజన తర్వాత నకిరేకల్‌ భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి చేరింది. 2009, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి వేముల వీరేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1957లో నియోజకవర్గం ఏర్పాటు
నల్లగొండ ద్విసభ్య నియోజకవర్గంలో ఉన్న నకిరేకల్‌ 1957లో నియోజకవర్గంగా ఆవిర్భవించింది. నాడు 57,440 ఓటర్లు ఉన్న నియోజకవర్గం 2023 నాటికి 2,44,467 ఓటర్లకు చేరుకుంది. 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఓటర్ల సంఖ్య రెండు లక్షలకు పైగా పెరిగింది. ఐదేండ్లలో 17,196 మంది కొత్తగా ఓటర్లు పెరిగారు. ఈ నియోజక వర్గంలో ప్రధాన వృత్తి వ్యవ సాయం. కేతెపల్లి మండల సరి హద్దులో సుమారు 40 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించే మూసీ ప్రాజెక్టు ఉంది. నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల్లో పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. రామన్నపేట మండలం మినహా మిగతా ఐదు మండలాలగుండా 65వ నెంబర్‌ జాతీయ రహదారి పోతుంది. చిట్యాల, రామన్నపేట, నార్కట్‌ పల్లి మండలాల కేంద్రాల మీదుగా రైల్వే లైన్‌ ఉంది.
చివరగా ఒకసారి..
2018లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చిరుమర్తి లింగయ్య బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుత ఎన్నికలకూ బీఆర్‌ఎస్‌ పార్టీ చిరు మర్తి లింగయ్యనే ప్రకటించింది. దాంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరి పోటీలో నిలబడ్డారు. 2014, 2018 ఎన్ని కల్లో కూడా ఈ ఇరువురి అభ్య ర్థుల మధ్యనే హోరాహోరీ పోరు జరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఇద్దరు పోటీ పడుతున్నారు. వామపక్షాలు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.