ఎవరి ధీమా వారిదే..!

– భరోసా తో బీఆర్‌ఎస్‌
– ఆత్మవిశ్వాసం తో కాంగ్రెస్
– తాము సైతం అంటున్న బీజేపీ
నవతెలంగాణ -పెద్దవూర: తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థా నానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్‌ పక్షాన జానారెడ్డి తనయుడు కుందూరు జయవిర్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా ప్రస్తుత ఎమ్మెల్యే నోముల భగత్ ఇక్కడ బరిలో వున్నారు. దీంతో రాష్ట్ర ప్రజల దృష్టి సాగర్ ఉంటుందని పలు పార్టీల నేతలు అంటున్నారు. ఇప్పటికే ఇరు పార్టీలు గ్రామాల్లో తిరుగుతూ తన విజయంపై భరోసాగా ఉన్నా రు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీలో వున్న జయవిర్ సాగర్ ప్రజలపై నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య హోరాహరీ పోరు జరగనుంది. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఎందుకంటే గతం నుంచి ఇప్పటి వరకు పార్టీని నడిపించే నాయకుడు లేక బీజేపీ శ్రేణులు నిరాశలో వున్నారు. నోముల
భగత్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరు తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కా ర్యకర్తలు, నాయకులతో ప్రచారం చేస్తున్నారు.
-గెలుపుపై ధీమా
ఆత్మవిశ్వాసంలో కాంగ్రెస్‌ సాగర్ నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని జయవీర్ విశ్వసిస్తున్నారు. తనను గెలిపిస్తే సాగర్లో ఆత్మగౌరవాన్ని చాటుతారని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.
-సాగర్లో ఓటర్లు
నాగార్జున సాగర్ లో మొత్తం 2,33,2412 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,14,752మంది, మహిళలు 1,18,649 మంది, ట్రాన్స్‌జెండర్లు 20 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆగస్టు ఒకటిన ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరిగింది. తుది జాబితాలో తేలిన లెక్క ప్రకారం నియోజకవర్గంలో 10,835 మంది కొత్త ఓటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో పురుషులు 4,978 మంది, 5,860 మంది మహిళలు ఉన్నారు.