– భారీ మెజార్టీ పై గురిపెట్టిన కాంగ్రెస్
– కాంగ్రెస్ ను ఓవర్ టెక్ చేసేందుకు గులాబీ ప్రణాళిక
– నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్,బి.ఆర్.యస్ సన్నాహక సమావేశాలు
– ప్రచారంలో దూసుకుపోతున్న భువనగిరి సిపిఐఎం అభ్యర్థి జహంగీర్
– నల్గొండ, భవనగిరి పార్లమెంట్ స్థానాల్లో హోరాహోరీ
– నేడు మిర్యాలగూడ,సూర్యాపేటకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
– ఉమ్మడి జిల్లాలో రాజుకుంటున్న రాజకీయాలు..
నవతెలంగాణ – సూర్యాపేట
లోక్ సభ సమరాంగణం సిద్ధమైంది. ఏ పార్టీ నుండి ఎవరు బరిలో నిలవనున్నారో తేటతెల్లమైంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బి.ఆర్.యస్, సీపీఐ(ఎం), బీజేపీ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇప్పటికే ఇందులో చాలామంది నామినేషన్లు కూడా దాఖలు చేశారు. మరికొంతమంది 25 వ తేదీ చివరి రోజు కావడంతో భారీ ఎత్తున నామినేషన్లు వేయనున్నారు. అనంతరం అభ్యర్థులు ప్రచారం వైపు దృష్టి సారించి విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఓట్లను పార్టీలు నియోజకవర్గాల వారీగా విశ్లేషించుకుంటున్నారు. మనకు వచ్చిన ఓట్లు ఎన్ని..? ప్రత్యర్థి పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని..? తదితర గణాంకాలను బేరీజు వేసుకుంటున్నారు. బలం ఏంటి, బలహీనతలు ఏంటి… అనేది పరిశీలించు కుంటున్నారు. అదేవిధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ కులాలు, వర్గాలు మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయావకాశాలపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల పరిధి ఉండగా కాంగ్రెస్,బిఆర్ఎస్, సీపీఐ(ఎం), బీజేపీ అభ్యర్థులకు మధ్య పోటీ రసవత్తరంగా మారనున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోరుకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ తీవ్రంగా మారే అవకాశం ఉంది. పోరాటాల పురిటిగడ్డ అయినా ఉమ్మడి నల్లగొండ జిల్లా అటు భువనగిరి, ఇటు నల్గొండ స్థానాలకు పోటీ జరుగుతుంది. ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు నల్గొండ కేంద్రబిందువుగా తెలుస్తుంది.
ప్రధానంగా రెండు పార్లమెంటు ఎన్నికల వేడి జిల్లాలో రాజుకుంది. నల్గొండ పార్లమెంటు ఎన్నికల బరిలో అధికార పార్టీ నుండి రఘువీర్ రెడ్డి, బి.ఆర్.యస్ నుండి కంచర్ల కృష్ణ రెడ్డి, బీజేపీ నుండి సైదిరెడ్డి లు పోటీలో వున్నారు. ఇక భువనగిరి పార్లమెంట్ కు కాంగ్రెస్ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీపీఐ(ఎం) నుండి జహంగీర్,బి.ఆర్.యస్ నుండి క్యామ మల్లేష్,బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ లు బరిలో ఉన్నారు. కాగా బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తప్పితే రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ దారులు రఘు వీర్ రెడ్డి, సైదిరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జహంగీర్, మల్లేష్ లు పాత వారైనప్పటికీ ఎంపీగా పోటీ చేయడం ఇదే ప్రథమం. ఈ ఎన్నికలు కూడా కొత్తవి కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో భారీ మెజార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. ప్రధానంగా 11 మంది ఎమ్మెల్యే లు అధికంగా ఉండటంతో విజయం తమదేనని ధీమాలో ఆ పార్టీ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధానంగా ఇద్దరూ అభ్యర్థులు ఎంపీలుగా పోటీ చేయడం కొత్త అయినప్పటికీ అటు నల్గొండ ఇటు భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు అధికంగా ఉండటంతో విజయం తధ్యం అని దీమాలో వున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా నల్గొండ పార్లమెంటు పరిధిలో రఘు వీర్ రెడ్డి విజయం కోసం సీనియర్ నాయకులు జానారెడ్డి తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి లు కృషి చేస్తున్నారు.
భువనగిరిలో మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే లు గెలుపుకోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోని రెండు చోట్ల ప్రియాంక గాంధీ తో సభ ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది.ఇకపోతే ఉమ్మడి జిల్లాలో బి.ఆర్.యస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయంతో పాటు నియోజకవర్గాలలో నాయకత్వ లోపంతో పార్టీ నుండి భారీ వలసలతో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.పార్లమెంట్ ఎన్నికల్లో
ఓట్ల మార్పిడి జరుగుతుందా..? లేదా..? అని అనుమానం వారిలో నెలకొంది. ప్రధానంగా కొత్త అభ్యర్థులు బరిలో ఉండటంతో అధికార పార్టీని ఢీ కొని సత్తా చాటుతా రా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇది గాక పార్టీలో గ్రూపు విభేదాలు కూడా అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారనున్నది. ఇది గాక రెండు పార్లమెంటు స్థానాలకు మాజీ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. గెలుపు బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆయనపైనే పెట్టడంతో ఉమ్మడి జిల్లాలోని ఇరువురు అభ్యర్థులను తీసుకొని వేర్వేరుగా నియోజకవర్గాలలో నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసి కార్యక్రమంతో పాటు అభ్యర్థుల పరిచయ కార్యక్రమం తో పాటు కాంగ్రెస్ లోపాలను ఎకరువు పెడుతున్నారు. ఇప్పటికే జగదీశ్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా కేసీఆర్ పాల్గొనే రోడ్ షోలను ఖరారు చేశారు. అందులో భాగంగానే బుధవారం మిర్యాలగూడలో, సూర్యాపేట లలో జరిగే రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొననున్నారు. సూర్యాపేటలో రాత్రి బస చేసిన తర్వాత భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తుంగతుర్తి, జనగామ లో పాల్గోని అదే రోజు భువనగిరి లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంటు బరిలో ఉన్న జహంగీర్ భారీ ఎత్తున నామినేషన్ వేసిన విషయం తెల్సిందే. అనంతరం నిర్వహించిన సభలో పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు,రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి,మల్లు లక్ష్మీ తదితరులు జహంగీర్ కు మద్దతుగా ప్రసంగించారు. ఈ సభ ఇచ్చిన బూస్టింగ్ తో ప్రజల్లో జహంగీర్ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచు కోట అయిన భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు సిపిఐఎం వినూత్నమైన ఎత్తుగడలతో ముందుకెళ్తుంది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎంపిగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని అపవాదు ఉన్నది. ఇది కాక బీజేపీ కి ఓటు బ్యాంకు లేకపోవడంతో ఆయనకు ఎదురీత తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ(ఎం), బి.ఆర్.యస్ అభ్యర్థుల మధ్యనే హోరాహోరీ పోరు నడిచే అవకాశం ఉంది. కాగా గురువారం తో నామినేషన్లు ఘట్టం ముగియనుంది. ఉపసంహరణల అనంతరం నల్గొండ, భవనగిరి పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల మద్య హోరాహోరీ పోటీ ఉండనున్నది.