మాస్కో : గగనతలం నుంచి వచ్చేదాడులను ఎదుర్కొనే ఆయుధాలు లేకపోవటం, రష్యాన్ మైన్ ఫీల్డ్స్ అపరిమితంగా ఉండటంతో తమ ప్రతిదాడి వెనకపట్టు పట్టిందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి అలెక్సె రెజ్నికోవ్ అన్నాడు. ‘గగనతలం నుంచి వచ్చే దాడులను రక్షించే పటిష్టమైన రక్షణ వ్యవస్థ లేకపోవటం, సరిహద్దు పొడుగు మరీ ఎక్కువగా ఉండటంవల్ల మా ప్రతిదాడి అనుకున్నంతగా ముందుకు సాగటం లేదు. శత్రువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది’ అని రెజ్నికోవ్ సిఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దక్షిణ యుద్ధ క్షేత్రంలో రష్యన్ మైన్ ఫీల్డ్స్‌ను ఛేదించటం చాలా కష్టంగా ఉందని రెజ్నికోవ్ వివరించారు. అయితే అందుకు తాను విచారించటం లేదనీ, ఎందుకంటే ప్రతి ప్రతిదాడి వేగంగా విజయవంతం కావాలనేమీ లేదని ఆయన అన్నారు. జూన్ ఆరంభంలో మొదలయిన ప్రతిదాడి ”అనుకున్నంతగా ముందుకు సాగటంలేదు” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు, వ్లాడీమీర్ జెలెన్ స్కీ అంగీకరించిన తరువాత ఉక్రెయిన్ రక్షణ మంత్రి పైన పేర్కొన్న విధంగా వ్యాఖ్యానించారు.