– మోడీని ప్రశ్నించిన చిదంబరం
రామేశ్వరం : మణిపూర్‌లో గత 150 రోజుల నుంచి హింసాకాండ కొనసాగుతున్నా.. ఆ రాష్ట్రంలో ఇంకా ఎందుకు పర్యటించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ప్రశ్నించారు. ఈ 150 రోజుల్లో వివిధ దేశాలు, దేశంలోని అనేక రాష్ట్రాలను సందర్శించిన మోడీకి మణిపూర్ వెళ్లడానికి మాత్రం సమయం దొరకలేదని విమర్శించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ రాహుల్ నిర్వహించిన పాదయాత్రకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా రామేశ్వరంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చిదరంబరం ప్రసంగించారు. మణిపూర్‌లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. సుమారు 60 వేల మంది తమ సొంత రాష్ట్రంలో శరణార్థులుగా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది కూడా (అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు) ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారని చిదరబరం ఆరోపించారు. మణిపూర్‌లో పరిస్థితిని నియంత్రించలేకపోవడానికి బీజేపీ, ప్రధాని మోడీనే కారణమని విమర్శించారు. కేంద్రం, మణిపూర్‌ల్లో బలహీనమైన పాలన ఉందని ఆరోపించారు. ప్రధానిమోడీ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మణిపూర్ పరిస్థితిని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు లేవనెత్తినప్పటికీ ప్రధాని పట్టించుకోలేదని విమర్శించారు.2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.