మన సాహిత్యరంగం ఎందుకిలా ఉంది!

Why is our literary industry?ఇటీవల బెంగళూరులో బుక్‌ బ్రహ్మ లిటరేచర్‌ ఫెస్టివల్‌ 2024ను నిర్వహించారు. దక్షిణ భారత సాహితీకారులు పాల్గొని సాహిత్య చర్చలు చేశారు. మూడు రోజుల పాటు జరిగిన  ఈ సాహిత్యోత్సవాలు ప్రచురణ సంస్థలు కలిసి నిర్వహించాయి. కళలు, సంగీతం, సాహిత్యం అన్నీ కలిసిన ఉత్సవంగా అందరి ప్రశంసలు పొందింది. అందులో పాల్గొన్న మన  తెలుగు సాహితీకారులు మన తెలుగులో ఇట్లా ఎందుకు నిర్వహించలేకపోతున్నామని బాధను వ్యక్తం చేశారు. ముఖ్యంగా కె.శ్రీనివాస్‌గారు రాసిన ‘మరీ ఇంత కళ తప్పిందేమిటీ  తెలుగుదనం’ అన్న వ్యాసంలో తెలుగు నేలపైన సాహిత్య, కళ, సంగీతాల మధ్య సమన్వయమూ, ఐక్యతా లేవని, ఆదరించే సాహితీప్రియులు, సమూహాలు లేవని బాధపడ్డారు.  బాధపడటమే కాకుండా సాంస్కృతిక జీవనంలోనూ, విలువల పాటింపులోనూ పతనస్థాయిలోకి పోయామనీ నిర్థారించారు. ఇక మన తెలుగు నేలపై మరో ప్రచురణ సంస్థ  నిర్వాహకులు గీతారామస్వామి, ‘సాహిత్యాన్ని, కళలను ఇంతగా అభిమానించే వారు మనకెందుకు లేరనీ, కన్నడ, తమిళ, కేరళలోని సాహిత్యకారుల లాంటి వ్యక్తిత్వాలు మనకు  వస్తున్నాయా’ అని ఆమె పడిన బాధనూ ఈ సందర్భంగా రచయిత ఉదహరించారు. దీంతో పాటు ‘తెలుగులో ఒకరి పొడ మరొకరికి గిట్టని తనం ఎక్కువ’ అని సాహిత్య అకాడెమీ  తెలుగు కన్వీనర్‌ సి.మృణాళిని అభిప్రాయాన్ని ఉటంకించారు.
దీనికి స్పందనగా విమర్శకులు, రచయిత సంగిశెట్టి శ్రీనివాస్‌ ఆధిపత్య బ్రాహ్మణ భావజాలంతో బుక్‌ బహ్మ సాహిత్యోత్సవాలు నిండిపోయాయని, ‘ఆధిపత్యానికి తెలుగుదనం ముసుగు’ అంటూ మరో వ్యాసం రాశారు. బహుజన భావజాలాల వారిని, అస్తిత్వవాదుల్ని తెలుగుసాహిత్య సమాజం విరోధులుగా నిర్థారించే ప్రయత్నం ఆ వ్యాసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. తెలుగు నేలలో వస్తున్న, రాస్తున్నవాళ్లు, విమర్శలో ముందుకొస్తున్నవాళ్లు ఎంతోమంది వున్నారని ఉదహరించారు. తెలంగాణలో కళాసాహిత్య నాటక ప్రయోగాలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయనీ, దళిత మైనారిటీ, బహుజనులు ఎంతోమంది కలిసి పనిచేస్తున్నారనీ వివరించారు.
అయితే ఇద్దరి వ్యాసాల్లోనూ వాస్తవాలున్నాయి. అక్కడ జరిగిన సభలు చూసి, మన తెలుగు సాహిత్యం పతన స్థితిలోకి పోయిందని బాధపడడంలో కొంత పాక్షికత వుంది. ఇక కె.శ్రీనివాస్‌గారి వ్యాసం థాట్‌ పోలీసింగ్‌గా వున్నదనీ, బ్రాహ్మణ భావజాల భావనను కలిగించిందన్న ఆరోపణా, శ్రీనివాస్‌గారు ఆ భావజాలానికి కొమ్ముకాస్తున్నాడనే ఆరోపణ సత్యదూరమని భావిస్తాను. అయితే టెక్ట్స్‌ను బహుజన స్పృహతో చూస్తే అలా కనిపించే ఆస్కారం వుంది. కానీ శ్రీనివాస్‌గారు ఆ స్పృహ లేకుండానే రాసి వుంటారనేది నా భావన.
ఇక కె. శ్రీనివాస్‌గారు బాధపడినంత దిగజారిపోయి, పతనావస్థలో తెలుగు సాహిత్యం వుందని నేననుకోవడంలేదు. కొత్తగా రాస్తున్నవాళ్లు, ప్రదర్శిస్తున్న కళలు, సంగిశెట్టి గారన్నట్లు బాగానే వస్తున్నాయి. అయితే వైయక్తిక పోకడలు పెరిగిన మాట వాస్తవం. ఎవరి బృందాలు వారు ఏర్పాటు చేసుకోవటం, ఎవరి కార్యక్రమాలు వారే నిర్వహించుకోవడం పెరిగిన మాటా వాస్తవం. ఐడెంటిటీ సమస్య, ఎక్స్‌పోజర్‌ విపరీతంగా పెరిగింది. సామూహికత, సంఘ స్పృహ తగ్గింది. ఐడెంటిటీ సమస్య కళా సాహిత్యాల్లో ఎప్పటినుండో వుంది. మనం చేసే సృజన సమాజ సంస్కరణ కోసమని భావించే తత్వం సన్నగిల్లింది. మన ప్రతిభ ప్రదర్శనగా మారిపోవటంతో ఇవన్నీ పెరిగిపోయాయి. వ్యక్తిత్వం వేరు, అభివ్యక్తి వేరుగా మారిపోయింది. మరి తెలుగు నేలలో ఇలాంటి ధోరణులు ఎక్కువగా పెరగడానికి కారణం ఏమిటో చర్చించాల్సిన అవసరం వుంది. సాంస్కృతిక రంగంలో అగ్రవర్ణ ఆధిపత్యాన్ని, దళిత, వెనుకబడిన వర్గాలు ధీటుగానే ఎదుర్కొని అధిగమించారని, ముఖ్యంగా తెలంగాణలో సాధ్యమయిందనే అనుకుంటున్నాను.
ఇక అసలు విషయానికొస్తే, తెలుగు నేలపైన సాంస్కృతిక పరమైన ఐక్యత, సాహిత్యం, కళల పట్ల అభిమానం సమాజంలో సన్నగిల్లడానికి, ఇక్కడి రాజకీయ ఆర్థిక పరిణామాలే కారణమని భావిస్తాను. 1990 నుండి ఉమ్మడి రాష్ట్రంగా వున్న తెలుగు నేల ప్రపంచీకరణ, నయా ఉదారవాద ఆర్థిక విధానాలను ఆహ్వానించి అమలు జరిపిన ప్రయోగశాల ఈ నేల. చాలావేగంగా ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అమలు పరిచిన రాజకీయ వ్యవస్థ ఇక్కడ కొనసాగింది. ప్రపంచీకరణ పాదం మోపింది కేవలం ఆర్థిక రంగంలోనే కాదు, సామాజిక, సాంస్కృతిక రంగాన్నీ విపరీతంగా ప్రభావితం చేసింది. ఇక్కడి యువతలో, ఉద్యోగుల్లో, మధ్య తరగతి ప్రజల్లో ఎన్నో కొత్త ఆశలను, ఆలోచనలను ప్రేరేపించింది. నీ విజయం నీ చేతుల్లోనే వుందనీ, నీ అభివృద్ధి నీ చేతిలోనే వుందన్న వ్యక్తి కేంద్రక ఆలోచనలను పాదుకొల్పింది. ఇక భాషాపరమైన భ్రమలూ పెంచింది. ఇంగ్లీషు చదువే జీవితాలను మార్చేస్తుందని, కంప్యూటర్‌ జ్ఞానమే జ్ఞానమనీ బోధించింది. సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు ఎందుకూ పనికిరానివిగా ప్రచారం చేసింది. ‘నేను, నాకేంటి’ అనే ఆలోచనలు జనంలో పెరిగాయి. ఈ ప్రభావం తెలుగు నేలపైన విపరీతంగా పడింది. అదే సందర్భంలో బాధిత సమూహాలు కూడా అస్తిత్వ వేదనలతో శకలాలుగా విడిపోయాయి. ఇవన్నీ సాహిత్య కళారంగాలపై ప్రభావాన్ని చూపాయి. మానవ సంబంధాలలో మనీ సంబంధాలే ప్రాబల్యం వహించాయి. ప్రజలలోనూ ఈ ఆలోచనలే వేళ్లూనుకునిపోయాయి. ఈ పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే.
మరి ఈ పరిస్థితులు తమిళ, కేరళ, కర్నాటక ప్రాంతాలకు వర్తించవా? అని ప్రశ్నించవచ్చు. కానీ ప్రపంచీకరణ, ప్రవేటీకరణ విధానాలను మనంతగా కౌగిలించుకోలేదు. అక్కడ వారి పూర్వ వారసత్వం సంఘసంస్కర్తల, సామాజిక ఉద్యమకారుల ప్రభావం ఆయా రాష్ట్రాలలో ఇప్పటికీ వుంది. వారి భాష, సంస్కృతిపై వారికున్నంత అభిమానం, ప్రేమ మనకు లేదు. తమిళనాడు, కర్నాటక, కేరళలో ఎప్పటినుండో సాహిత్యం, సంగీతం, నాటకం కలిసి పనిచేస్తున్నాయి. ఇక్కడ మనకలా లేదు. 1940, 50 లలో అట్లా మన దగ్గరా వుండింది. ఇప్పుడు లేదు. తమిళనాడులో ప్రాంతీయ రాజకీయాలే ఆధిపత్యం వహిస్తాయి. ప్రపంచీకరణ ప్రభావాన్ని తట్టుకుని, వారి సాంస్కృతిక జీవనాన్ని సజీవంగా వుంచుకోగలుగుతున్నారు. ఇక కేరళలో కమ్యూనిస్టులు, ప్రగతిశీల భావచైతన్య ప్రభావం ఇప్పటికీ వుంది. కర్నాటకలోనూ అంతే. ఈ నేపథ్యంలో తెలుగు నేలన వైయక్తిక వాదం ప్రబలిందనేది నా భావన. అంతటా ప్రపంచీకరణ ప్రభావం వున్నప్పటికీ మనం మరింత గురయ్యాం. దాని ఫలితమే మనకు కనపడుతున్నది.
మన తెలుగు ప్రాంతంలో వేమన, పోతులూరి, కందుకూరి, గురజాడ, గిడుగు, కుసుమధర్మన్న, భాగ్యరెడ్డివర్మ, మాడపాటి, సురవరం, వట్టికోట, శ్రీశ్రీ, జాషువా, వొద్దిరాజు సోదరులు, దాశరథి సోదరులు మొదలైన సాహితీకారులు, సంస్కర్తలు నడిపిన ఉద్యమాన్ని ఆ తర్వాత కొనసాగించలేకపోయాం. అభ్యుదయ సాహిత్యోద్యమమూ, ప్రజానాట్య మండలి కలిసి మహోజ్వలంగా జరిపిన కృషి అరవైల తర్వాత వెనుకపట్టు పట్టింది. వాళ్లందించిన చైతన్యం, స్ఫూర్తిని అందుకోలేకపోవడం మన వైఫల్యం. అయితే మన సమాజంలో అందుకవసరమైన ఏ సామాజిక, రాజకీయ ఉద్యమాలూ పెద్దగా లేకపోవడమూ ఒక కారణమే. తెలంగాణలో నాటి సాయుధ రైతాంగపోరాట ఆరంభంలో ఆంధ్రమహాసభ, గ్రంథాలయోద్యమం విస్కృతంగా సాగింది. ప్రజా సాంస్కృతిక చైతన్యమూ వెల్లివిరిసింది. ఇక మొన్నటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలోనూ సాహిత్య కళా సృజన కొంత జరిగింది. ఆ తర్వాత స్థబ్దంగా మారిన మాట వాస్తవం. ఒక చైతన్య పూరిత ఉత్సాహం, ఐక్యత కొరవడింది.
అయినప్పటికీ నిరంతరంగా సాహిత్య చర్చలు, ఆవిష్కరణలు, సెమినార్లు జరుగుతూనే వున్నాయి. 2015 నుండి తెలంగాణ సాహితి ఇప్పటి వరకు ఐదు లిటరరీ ఫెస్ట్‌లు నిర్వహించింది. మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్ట్‌కు హాజరు, ఆదరణ బాగానే వుంది. అర్థవంతమైన చర్చలు జరిగాయి. అరసం, విరసం, ఇతర వేదికల సభలు విజయవంతం అవుతున్నాయి. యూనివర్సిటీలలోనూ జాతీయస్థాయి సాహితీ చర్చలు సాగుతున్నాయి. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నిర్వహణ, అమ్మకాలూ బాగానే వున్నాయి. చైతన్యయుతమైన స్పృహతో సమన్వయం చేయగలిగితే ఆదరించే సమూహాలూ, వ్యక్తులూ ఇక్కడ తక్కువేం కాదు. అభిప్రాయభేదాలు ఎప్పుడైనా, ఎక్కడైనా వుంటాయి. మనం నిరాశ చెందాల్సిన పనిలేదు. నేడు ఎదురవుతున్న సవాళ్లపై పోరాడుతున్న సమూహాలతో కలిసి పనిచేయగలగడమే పరిష్కారం.
– కె.ఆనందాచారి, 9948787660