జమిలిపై ఎందుకంత ఉలికిపాటు?

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జమిలి ఎన్నికలంటే రేవంత్‌ రెడ్డికి ఎందుకంత ఉలికిపాటు… అభద్రతాభావం అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కే లక్ష్మణ్‌ ప్రశ్నించారు. సోమవారంనాడిక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ చరిష్మాను జీర్ణించుకోలేకే కాంగ్రెస్‌ విషప్రచారం చేస్తున్నదని విమర్శించారు. 1952 నుంచి 1967 వరకు నాలుగుసార్లు జమిలి ఎన్నికలు జరిగాయనీ, అప్పుడెందుకు కాంగ్రెస్‌ సమర్థించిందని ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్‌ తన ఉనికిని కాపాడుకోవడానికే ఈ పని చేసిందా అని అడిగారు. దక్షిణాది, ఉత్తరాది అంటూ కాంగ్రెస్‌ ఆనాడు లేని ప్రస్తావనను ఇప్పుడు ఎందుకు చేస్తున్నదని ప్రశ్నించారు. జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన కమిటీలో ప్రతిపక్ష నాయకుడిగా అధిర్‌ రంజన్‌కి అవకాశం కల్పిస్తే కాంగ్రెస్‌ ఎందుకు పారిపోతున్నదని అడిగారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి మారన్‌ సనాతన ధర్మంపై విద్వేషపూరితంగా, అవమానకరంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదనీ, ఆ ధర్మాన్ని నిర్మూలించాలనీ, నాశనం చేయాలని వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు. తమిళనాడు ప్రభుత్వ అధికారిక చిహ్నంలోనే ఆలయం ముద్రణ ఉందనీ, దమ్ముంటే ఆ చిహ్నాన్ని తీసేయాలని సవాల్‌ విసిరారు. మందిరాలు, ఆలయాల నుంచి వచ్చే ఆదాయంతో ఖజానా నింపుకునే తమిళనాడు ప్రభుత్వం హిందూ ధర్మం గురించి నీచంగా వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు.