సమస్యలు పరిష్కారం కాని సమావేశాలెందుకు?

 – మండల సభ నిర్వహణపై సభ్యుల ధ్వజం
నవతెలంగాణ – గంగాధర : మూడు నెలల కింద జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలే పరిష్కారం కాక పోగా మళ్లీ సమావేశం నిర్వహించడం ఎందుకంటూ సభ్యులు మండిపడ్డారు. గంగాధర మండల పరిషత్ సమావేశ భవనంలో బుధవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో నిర్వహించారు. ఎంపీపీ శ్రీరాం మధుకర్ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. గత సమావేశంలో మండలంలోని అనేక గ్రామాల సమస్యలపై లేవనెత్తిన సమస్యలను అధికారులు నేటికీ పరిష్కరించలేదని ఆయా గ్రామాల సర్పంచులు ఆరోపించారు. జవాబుదారితనం లేకుండా మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలను మొక్కుబడుగా నిర్వహించడం వల్ల సమయం వృధా తప్ప ఒరిగిందేమిలేదని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిన వివిధ శాఖల అధికారులు గైర్హాజరు కావడం వల్లే సభలో చర్చించిన సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. గత మూడు మాసాల కింద లేవనెత్తిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గంగాధర సర్పంచ్ మడ్లపల్లి గంగాధర్ డిమాండ్ చేశారు. అనే గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాల్సిన తహసీల్దార్ సమావేశానికి గైర్హాజరు కావడం ఏంటని ప్రశ్నించారు. మండల పరిషత్ సమావేశానికి వస్తే తహసీల్దారే రావాలని, లేదంటే తమ కింది స్థాయి అధికారులను పంపాల్సిన అవసరం లేదని సభ్యులు అన్నారు. సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన లేని కింది స్థాయి అధికారులు సమావేశానికి హాజరైన ప్రయెాజనం లేదని, సమావేశం నుండి డీటీ వెళ్లిపోవాలని సభ్యులు కోరారు. దీంతో సమావేశం నుండి డిప్యూటి తహసీల్దారు చంద్రశేఖర్ వెళ్లిపోయారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుపై క్లారిటీ ఇవ్వాల్సిన తహసీల్దారు సమావేశానికి రాకపోవడంపై జిల్లా అధికారులకు, కలెక్టర్ కు నివేదించాలని సభ్యులు డిమాండ్ చేశారు. మరణించిన పెన్షన్ దారుల పేర్లు తొలగించక కొత్త వారికి పెన్షన్లు అందక ఇబ్బంది పడుతున్నారని లక్ష్మిదేవిపల్లి సర్పంచ్ విజయలక్ష్మి ఆరోపించారు. హరితహారం ద్వారా మొక్కలు నాటేందుకు సర్కార్ స్థలాలను చూపాలని, మార్కవుట్ ఇవ్వాలని వెంకటాయపల్లి సర్పంచ్ శ్రీమల్ల మేఘరాజ్ కోరారు. సర్కారు స్థలాలు చూపుతేనే హరితహారం కింద మొక్కలు నాటేందుకు గ్రామాల్లో చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మిషన్ భగీరథ పథకం కింద గ్రామాలకు చేరుతున్న నీరు సమయపాలన లేకుండా సరఫరా చేస్తున్నారని ఆయా గ్రామాల సర్పంచులు మండిపడ్డారు. వెంకటాయపల్లి గ్రామంలో అనేక రకాల కూరగాయలు సాగు అవుతుంటే హార్టికల్చర్ ఆఫీసర్ గ్రామాన్ని, రైతులను పట్టించుకోకుండా చూద్దామంటే కనిపించకుండా పోయారంటూ గ్రామ సర్పంచ్ శ్రీమల్ల మేఘరాజ్ ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో మల్హోత్ర, సీడీపీఓ కస్తూరి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.