ఎందుకు తెచ్చారు….ఎందుకు రద్దు చేశారు

– ప్రజాధనం వృథా చేస్తున్న మోడీ
– విలేకరుల సమావేశంలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
పెద్ద నోట్లు ఎందుకు తెచ్చారు.. ఎందుకు రద్దు చేశారో మోడీ ప్రజలకు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం గతంలో నల్లధనం వెలికి తీస్తానని చెప్పి అప్పట్లో ఉన్న 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేశారని గుర్తు చేశారు. నల్లధనం మాత్రం రాలేదని, కొత్త నోట్లు ముద్రించేందుకు ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఇప్పుడు 2000 నోటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని, దీనివల్ల ఆ నోట్లు ముద్రించేందుకు కోట్ల రూపాయలు వద అయ్యాయని విమర్శించారు. ఎందుకు తెచ్చారు… ఎందుకు రద్దు చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. నోట్ల రద్దు వెనక రాజకీయ కోణం ఉందని, వారి ప్రయోజనాల కోసమే నోట్లను రద్దు చేస్తున్నారని చెప్పారు. మోడీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరైనది కాదన్నారు. 2000 నోట్లను తీసుకురావడంపై ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఇప్పుడు నోటు రద్దు చేయడం వెనక ప్రజలకు ప్రయోజనం ఏమి ఉండదన్నారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే మోడీ నోట్లను రద్దు చేస్తున్నాడని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు వినోద్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.