– గుర్తింపు కోసం జాతుల మధ్య ఘర్షణలు
– పోలీసులకు సవాలుగా శాంతి భద్రతలు
– సైబర్ హింసతో భవిష్యత్‌కు ముప్పు
– ఆస్కీ సదస్సులో డీజీపీ అంజన్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రపంచవ్యాప్తంగా సామాజిక తరగతులు, జాతుల మధ్య గుర్తింపు కోసం సాంఘీక పోరాటాలు ఉధృతమవుతున్నాయని డీజీపీ అంజన్‌కుమార్ అన్నారు. రాజకీయ జోక్యంతోనే వీటిని సరిదిద్దాలనీ, శాంతి భద్రతల సమస్యలుగా మారితే పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారతాయంటూ మణిపూర్ హింసను ప్రస్తావించారు. మణిపూర్ హింసలో 300 మంది మరణించారనీ, 900 మంది క్షతగాత్రులయ్యారనీ, నాలుగు నెలలైనా అక్కడి హింస కొనసాగుతూనే ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధాలు ప్రజల చేతుల్లోకి వెళ్లి, పౌరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతున్నదని చెప్పారు. గతంలో మండల్ కమిషన్ ఘర్షణలు, జాట్ రిజర్వేషన్ల ఘర్షణలు కూడా ఈ కోవలోవేనని ఉదహరించారు. రాజకీయంగా ఎవరి రాష్ట్రాల్లో వారి సామాజిక వర్గాల ఆధిపత్యం, సెంటిమెంట్లు పెరుగుతున్నాయనీ, ఇవి అంతిమంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని విశ్లేషించారు. ప్రపంచ దేశాలు కూడా ఇదే తరహా సమస్యల్ని ఎదుర్కొంటున్నాయంటూ ఆయా దేశాల్లో జరిగిన పలు సంఘటనల్ని ఉదహరించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ‘సామాజిక మార్పులో పోలీసుల పాత్ర- ఎదురవుతున్న సవాళ్లు’ అంశంపై శుక్రవారం ప్రొఫెసర్ ఎస్ వేణుగోపాలరావు స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజన్‌కుమార్ ముఖ్య వక్తగా మాట్లాడారు. చట్టాలు అతిక్రమించినందుకు లండన్‌లో వెయ్యిమంది, యూఎస్‌ఏలో 1009 మంది పోలీసులపై కేసులు నమోదై, సస్పెండ్ అయ్యారని ఆయన తెలిపారు. 2021 అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలో 6,164 మంది పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని గతంలో నేరాలకు పాల్పడేవారని చెప్తూ హర్షద్ మెహతా, అబ్దుల్ కరీం తెల్గీ, కేతన్ పరేఖ్ కేసుల్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా నేర స్వభావం మారుతున్నదనీ, సైబర్ నేరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సమాజంలో వస్తున్న మార్పుల్ని ఏ వ్యవస్థ అయినా స్వీకరించాల్సిందేనన్నారు. భారతదేశంలో న్యాయ స్థానాల తీర్పులు, ఆంక్షల నేపథ్యంలో పోలీసులు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందనీ, ఇది విధి నిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ముంబయి మారణహౌమంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ సరిహద్దుల్లో ఉండి, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తూ, ఇక్కడ హింసకు పాల్పడుతున్న టెర్రరిస్టులకు డైరెక్షన్లు ఇచ్చారనీ, సాంకేతికతను విధ్వంసానికి ఎలా వినియోగించవచ్చో ఆ ఘటన ఉదాహరణ అని చెప్పారు. భవిష్యత్‌లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో కూడిన సైబర్ ఆప్టిక్ దాడులు, నేరాలు పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ నేరాల ఉధృతిలో సోషల్ మీడియా ప్రభావం కూడా ఉందనీ, అందువల్లే ఇటీవల ఎక్కడ అల్లర్లు జరిగినా ఇంటర్నెట్‌ను తొలగించి ఆపరేషన్స్ చేపట్టాల్సి వస్తున్నదని వివరించారు. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారం సైబర్ నేరగాళ్ల వల్ల ఆరు శాతం చోరీకి గురవుతున్నదని చెప్పారు. భవిష్యత్‌లో డ్రోన్ బాంబుల ప్రమాదం పొంచి ఉందనీ, వాటి ద్వారా ప్రమాదకరమైన రసాయనాలను ప్రజా సమూహాలపై చల్లితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే భారతదేశంలోని జైళ్లు 130 శాతం ఆక్యుపెన్సీతో నిండిపోయాయనీ, మానవ అక్రమ రవాణా సవాలు విసురుతున్నదని అన్నారు. నేరాల అదుపు కోసం పోలీసులు సహా అన్ని వ్యవస్థల్లోనూ ప్రతి మూడునెలలకోసారి ఆధునిక శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. మరోవైపు పౌర సమాజం నేర నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి ఆస్కీ చైర్మెన్ పద్మనాభయ్య అధ్యక్షత వహించారు. పలువురు ఐపీఎస్ అధికారులు, ఆస్కీ రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు.
విస్తరిస్తున్న సాంఘిక పోరాటాలు
3:01 am