నైజర్‌ మరో యుద్ధ క్షేత్రం కానుందా?

పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌ లో సైనిక తిరు గుబాటు జరిగి అక్కడి ప్రభుత్వం కూలి పోయింది. పశ్చిమ ఆఫ్రికాలో నైజర్‌ పరిస్థితినే మిగిలిన దేశాలు కూడా ఎదుర్కొంటున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో ఫ్రెం చ్‌ వలసవాదం ఇప్పటికీ కొనసాగుతోంది. అక్కడి దేశాల ఆర్థిక, సైనిక సంపత్తిని, రాజకీ యాలను ఫ్రాన్స్‌ నేటికీ శాసిస్తోంది. సరిగ్గా ఇదే కారణం చేత నైజర్‌ లో జరిగిన సైనిక తిరుగుబాటును ఆ దేశ ప్రజలు ఆమోదించటమే కాకుండా హర్షిస్తున్నారు.
నేడు మనం నివసిస్తున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఆఫ్రికా దేశాలకు రాజకీయ వెసులుబా టు అందుబాటులోకి వచ్చింది. ఈ దేశలకు పశ్చిమ దేశాల ప్రాబల్యం నుంచి బయటపడ టానికి అవకాశం లభిస్తోంది. నైజర్‌ భూపరివేష్టిత (లాం డ్‌ లాక్డ్‌) దేశం. యుద్ధం, దారిద్య్రంతో సతమతమౌతున్న దేశం. అయితే నైజర్‌లో ఖనిజ సంపద అత్యంత సమృ ద్ధిగా ఉండటం వల్లే అది మరో యుద్ధ క్షేత్రంగా మారే అవకాశం కనపడు తోంది.
ఏకధ్రువ ప్రపంచానికి అధినేతగా అమెరికా తన ఆధిపత్యాన్ని చెలాయి స్తున్న రోజుల్లో సహాయసహకారాల కోసం ఆఫ్రికా దేశాలు పశ్చిమ దేశాలను ఆశ్రయిం చాయి. ‘టెర్రరి జంపై యుద్ధం’ జరుగుతున్న కాలంలో ఇస్లామిక్‌ తిరుగుబాటు దారులు ప్రజల భద్రతకు ముప్పుగా ఏర్పడినప్పుడు పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఫ్రెంచ్‌, అమెరికా సైన్యాలు తిష్టవేశాయి. పశ్చిమ దేశాలు అలా చేసిన సహాయసహకారాలకు మూల్యంగా నయా ఉదారవాద విధానాలను ఆమోదించటం ఆఫ్రికా దేశాలకు అనివార్యమైంది.
ఆ తరువాత ప్రపంచం చాలా మారిపోయింది. నేటి ప్రపంచంలో ప్రాబల్యం కోసం అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలు ఒకవైపు, చైనా, రష్యాలు మరోవైపు పోటీపడుతున్న నేపథ్యంలో ఆఫ్రికా దేశాలకు ఒక ప్రత్యామ్నాయం అందుబాటు లోకి వచ్చింది. ఈ ప్రత్యామ్నాయంలో ఆఫ్రికా దేశా లకు మరింత రాజకీయ స్వయం ప్రతిపత్తి, పశ్చిమ దేశాల షరతుల నుంచి మరింత వెసులుబాటు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు భద్రతకు పశ్చిమ దేశాల సైన్యాలకు బదులుగా వాగర్‌ గ్రూపు ను, అభివృద్ధికి అంతర్జాతీయ ద్రవ్య నిధికి బదులుగా చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ కార్యక్రమాన్ని వినియోగించు కోవటం మొదలైంది.
ఈ పరిస్థితుల్లో నైజర్‌ వంటి అస్థిర దేశాలలో సైన్యం బలంగా వున్నప్పుడు పశ్చిమ దేశాల నుంచి ముప్పు ఏర్పడకుండా(అమెరికా సైనికంగా ప్రత్యక్షం గా జోక్యం చేసుకునే పరిస్థితిలో లేనందున) అధికా రాన్ని కైవసం చేసుకునే అవకాశం ఏర్పడింది. దీంతో పశ్చిమ ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలలో, సైన్యాలలో ఫ్రెంచ్‌ వ్యతిరేక ధోరణి బాగా పెరిగింది. ఒకే ఒక సంవత్సరంలో మాలి, బర్కినా ఫాసో దేశాల నుంచి ఫ్రెంచ్‌ సైన్యాన్ని బహిష్కరించటం జరిగింది. ప్రస్తు తం నైజర్‌లో కూడా జరుగుతున్నది అదే. అయితే నైజర్‌లో ఫ్రాన్స్‌ మద్దతుతో అంతర్యుద్ధం జరిగే ప్రమాదం పొంచివుంది.
ఒకవేళ నైజర్‌లో జరిగిన సైనిక తిరుగుబాటు విజయవంతమైతే నూతన సైనిక ప్రభుత్వం తన భద్రత కోసం రష్యాతో సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం ఉంది. నైజర్‌కు చైనా నుంచి షరతులు లేని ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది. నైజర్‌ ఒక పేద, లాండ్‌ లాక్డ్‌ దేశమైనప్పటికీ నైజర్‌ కు వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. నైజర్‌ లో ఖనిజ సంపద ముఖ్యంగా యురేనియంతోపాటు బొగ్గు, బంగారం, ఇనుము, తగరం, ఫోస్ఫేట్స్‌, పెట్రోలి యం,మోలిబ్డెనం, జిప్సంవంటివి దండిగా ఉన్నాయి.
నైజర్‌లో లభ్యమయ్యే యురేనియం ఫ్రాన్స్‌కు అత్యంత కీలకం. ఫ్రాన్స్‌కు అవసరమైన యురేనియ ంలో 15శాతం, యూరోపియన్‌ యూనియన్‌కి అవసరమైన యురేనియంలో 20శాతం నైజర్‌ నుంచి ఎగుమతి అవుతోంది. ఫ్రాన్స్‌ అణు రియాక్టర్లు నడ వాలంటే నైజర్‌ యురేనియం అవసరం ఉంటుంది. ఫ్రెంచ్‌ ఎనర్జీ స్వతంత్రత ఆశ్చర్యకరంగా నైజర్‌ పై ఆధారపడివుంది. నైజర్‌లో నూతనంగా ఏర్పడిన సై నిక ప్రభుత్వం ఫ్రాన్స్‌కు చేస్తున్న యురేనియం, బం గారం ఎగుమతులను నిలిపివేసే అవకాశం ఉన్నందు న ఫ్రాన్స్‌ సైనికంగా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. రష్యా నుంచి చౌకగా అందుతున్న గ్యాస్‌ను ఉక్రెయిన్‌ మెప్పుకోసం కాలదన్నిన ఫ్రాన్స్‌కు నైజర్‌ నుంచి ఎదురౌతున్న పరిస్థితి సంకటంగా మారింది. నైజర్‌లో ఫ్రెంచ్‌ ప్రయోజనాలను కాపా డుకునేందుకు ఫ్రాన్స్‌ తక్షణం తగినవిధంగా స్పంది స్తుందని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ ప్రకటించాడు. అయితే ఎటువంటి బహిర్గత జోక్యా న్నైనా సాయుధంగా ఎదుర్కుంటామని నైజర్‌ సైనిక పాలకులు స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌ సైనికంగా జోక్యం చేసుకుని మాజీ అధ్యక్షుడిని తిరిగి అధికార పీఠంపైన కూర్చోపెట్టాలని చూస్తోందని నూతన సైనిక ప్రభుత్వం ఆరోపిస్తోంది.
దీనితో నైజర్‌ మరో యుద్ధ క్షేత్రం అవుతుందని భావిస్తున్నారు. ఆఫ్రికాలో సైనిక తిరుగుబాట్లు సాధారణమే అయినప్పటికీ నూతనంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ వాతావరణంలో ఇది సరికొత్త ప్రచ్చన్న యుద్ధానికి దారితీస్తుందని నిష్ణాతులు విశ్లేషిస్తున్నారు. తనదైన స్వాతంత్య్రాన్ని, సంపద సృష్టిని ఆకాంక్షించే ఆఫ్రికాపట్ల తరతరాలుగా పశ్చిమ దేశాలు ప్రధర్శిస్తున్న ఆధిపత్య ధోరణి పర్యవసానం గానే ఆఫ్రికా తిరగబడుతోంది. అటువంటి తిరుగుబాటుకు నేడు నైజర్‌ వేదికైంది.