తెలంగాణ ఎన్నికల్లో నిరుద్యోగం ప్రధాన అంశమైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు నిరుద్యోగుల అంశాన్ని రాజకీయ అస్త్రంగా ప్రయోగిస్తున్నాయి. ఆ అనివార్యత ఏర్పడింది. లేకపోతే వారి మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. పదేండ్ల స్వరాష్ట్ర పాలనలో నిరుద్యోగం నివురుగప్పిన నిప్పులా పెరుగుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ”నీళ్లు..నిధులు.. నియామకాలు..” అనేది సకల జనుల నినాదం. నిరుద్యోగుల ఆత్మ బలిదానాలు.. ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం అనే గమ్యాన్ని ముద్దాడినా.. నిరుద్యోగుల బతుకులు ఇప్పటికీ ఆగమాగంగానే ఉన్నాయి. రాష్ట్రంలో లక్షా తొంభైరెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు బిస్వాల్ కమిటీ తేల్చినా.. గ్రూప్-1 నోటిఫికేషన్ రావడానికి ఎనిమిదేండ్లు పట్టింది. ఆ ఒక్కటే కాదు..! రాష్ట్రం వెలువడిన అన్ని నోటిఫికేషన్లు ”జాబ్ కొట్టాల్సిందే.. తగ్గేదే లే..” అన్న పట్టుదలతో ఉన్న యువతకు అందని ద్రాక్షగా ఊరిస్తూనే ఉన్నాయి. అందుకే ఎన్నికల వేళ అన్ని పార్టీలు ‘జాబ్ క్యాలెండర్’ ప్రకటిస్తామంటూ హమీలు గుప్పిస్తూ రాజకీయంగా వాడుకుంటున్నాయి.
ఇంటికో ఉద్యోగం అన్న హామీ అటకెక్కింది. నిరుద్యోగ భృతి అందడం లేదు. ప్రయివేటు ఉద్యోగాల కల్పన, స్థాని కులకు అవకాశాల ఊసే లేకుండాపోయింది. రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు వస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు ఆర్బాటంగా చెబుతున్నా, వాటిల్లో మన రాష్ట్ర యువత ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో చెప్పడం లేదు. తెలంగాణ వస్తే మాకేమి వచ్చిందని నిరుద్యోగులు నిట్టూరు స్తున్న పరిస్థితి దాపురించింది. ఉద్యోగ కల్పనకు అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వ నిర్లక్యం మూలంగా నిరుద్యోగ యువత అనేకసార్లు మోసపోతూనే ఉన్నారు. యువత ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలకు నిరుద్యోగ అంశమే రాజకీయ ఎజెండాగా మారింది. ఇప్పుడు ఆ పార్టీల గెలుపు ఓటములను నిర్ణయించేది సైతం నిరుద్యోగ యువతే. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు నిరుద్యోగులను తమవైపు మల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇన్నేండ్లుగా యువత, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించిన పాలకుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. తమకు ఉద్యోగాలు లేకుండా చేసి తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసి, తమను వంచించిన ప్రభుత్వానికి వీరు రిటన్ గిఫ్ట్ ఇస్తారేమో అన్న భయం వెంటాడుతోంది. వెరసి ఈ అంశాలు విపక్షాలకు కలిస్తున్నాయి. అందుకే నిన్నటికి నిన్న మంత్రి కేటీఆర్ నిరుద్యోగ యువతతో భేటి అయ్యి ‘ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారే అశోక్‌నగర్‌లో యువతతో సమావేశం’ అని, ‘అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్’ అని వాగ్ధానమిస్తున్నారు. మరి ఇన్ని రోజులు అధికారంలో ఉండి ఆ పని ఎందుకు చేయలేదు అమాత్యా?
ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదిన్నరేండ్ల క్రితం ఎన్నికల ప్రసంగాల్లో తమకు పగ్గాలు అప్పజెపితే యేటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తానని యువతను నమ్మించారు. నమ్మిన యువతను ఎలా వంచించారో వివరించి చెప్పనక్కర లేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంలోనే లక్షలాది ఉద్యోగ ఖాళీలుంటే… ఆయన మాత్రం కుంటుతూ, మూలుగుతూకొన్ని వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తున్నట్టు ప్రచారం చేయించుకొంటారు. అంతే కాదు పకోడిలు అమ్ముకోవడం కూడా ఉపాధే అని ఉచిత సలహాలిస్తున్నారు. దేశాధినేతలే నిరుద్యోగులతో ఇలా పరిహాసం ఆడుతుంటే ఇంక కొత్త ఉద్యోగాలు వస్తాయన్న ఆశ అడుగంటిపోతుంది. సర్వం కార్పొరేట్లకు అప్పగిస్తున్న బీజేపీ హయాంలో ప్రభుత్వరంగం దారుణంగా కుదించుకు పోతున్నాదన్నది జగమెరిగిన సత్యం.
కేంద్రం రిజర్వేషన్లను రద్దు చేయనవసరం లేకుండా ప్రయివేటైజేషన్ ద్వారా వాటికి తలకొరివి పెడుతున్నది. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య భవిష్యత్తులో అనేక సంక్షోభాలకు దారి తీసే ప్రమాదమున్నది. తయారీ రంగాన్ని గరిష్ట స్థాయికి అభివృద్ధి చేయకపోతే పెనుముప్పు తప్పదు. వ్యవసాయాధార స్థితిని తొలగించి ప్రజలను పరిశ్రమలు, సర్వీసు రంగాల వైపు తరలించడ మనేది సునాయాసం కాదు. ఉపాధి పెరగా లంటే పరిశ్రమలు, ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయకుండా దీనికి వ్యతరేక సిద్ధాంతాన్ని తమ ఎజెండాగా చేసుకున్న పాలకులు ఎవరికి ఉపాధి చూపుతారు? ఎలా చూపుతారు? అందుకే యువత ఆ ఎజెండాను తిప్పికొట్టే ఉద్యమాల్లో ముందుండాలి.
భారత్‌లో 25 ఏండ్ల లోపు వారు దేశ జనాభాలో 40 శాతానికి పైగా ఉన్నారు. నిరుద్యోగుల సంఖ్యను బట్టి ఉద్యోగాలు సృష్టించకపోతే సామాజిక అశాంతి ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే దేశానికి ఇది అతిపెద్ద ముప్పుగా మారే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికలను పెడచెవిన పెట్టకుండా రాజకీయ పార్టీలు తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. ఉద్యోగాల కల్పన అనేది కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చే సాధారణ హమీగా మిగలకూడదు.