ఎన్నికల కమిషనర్‌ స్థాయిని తగ్గిస్తారా ?

Will the level of Election Commissioner be reduced?– సీనియర్‌ అధికారి హోదాకే పరిమితమా?
– మాజీ సీఈసీల ఆవేదన
– ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయం
న్యూఢిల్లీ : ఎన్నికల కమిషనర్ల హోదాను సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయి నుండి ఓ సీనియర్‌ అధికారి స్థాయికి తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుపై మాజీ ఎన్నికల ప్రధానాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన విధివిధానాలలో మార్పులు చేస్తూ రాబోయే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలలో బిల్లును ప్రతిపాదించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఇతర కమిషనర్లను నియమించే విషయంలో ప్రభుత్వానికి విశేషాధికారాలు కట్టబెట్టడాన్ని గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును నీరుకార్చేలా, కాలరాసేలా ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం ముగ్గురు ఎన్నికల కమిషనర్ల సర్వీసు నిబంధనలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయి నుండి క్యాబినెట్‌ కార్యదర్శి స్థాయికి కుదించారు. ఇకపై వారికి క్యాబినెట్‌ కార్యదర్శి జీతభత్యాలే లభిస్తాయి.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎన్నికల ప్రధానాధికారులు ఈ విషయంలో ప్రధాని మోడీకి లేఖ రాయాలని నిర్ణయించారు. నూతన బిల్లు ఎన్నికల కమిషన్‌ స్థాయిని, దానిలోని అధికారుల స్థాయిని దిగజార్చిందని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ తెలిపారు. ఎన్నికల కమిషనర్లకు ఓ సీనియర్‌ అధికారితో సమానంగా జీతభత్యాలు ఇస్తే ఆయన హోదా సహాయ మంత్రి స్థాయి కంటే తగ్గిపోతుందని చెప్పారు. దీనివల్ల వారు రాజకీయ నాయకులపై చర్య తీసుకోవడానికి వెనుకంజ వేస్తారని అన్నారు. అనేక దేశాలలో ఎన్నికల కమిషనర్లే న్యాయమూర్తులని గుర్తు చేశారు. ఎన్నికల కమిషనర్ల హోదా విషయంలో ఎలాంటి మార్పులు చేయవద్దని, దానిని ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగించాలని సలహా ఇస్తూ ప్రధానికి లేఖ రాయాలని మాజీ సీఈసీలు నిర్ణయించారు. అయితే వీరి అభిప్రాయాలతో ప్రభుత్వం ఏకీభవించడం లేదు. ప్రొటోకాల్‌ జాబితాను సవరించాలని భావించడం లేదని, సీఈసీకి ప్రస్తుతమున్న హోదా, ప్రతిపత్తి కొనసాగుతాయని వివరించింది. వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లును ప్రతిపాదించింది. దీని ప్రకారం… ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర ఎన్నికల అధికారుల నియామక ప్రక్రియ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించారు. నియామక కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేత మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఎన్నికల అధికారుల జీతాలు, ఇతర అలవెన్సులలో కూడా మార్పులు ప్రతిపాదించారు. ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఇది రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, ప్రజల హక్కుల పైన జరిగిన దాడిగా అభివర్ణించాయి.