– ఫేవరేట్‌గా డిఫెండింగ్ చాంప్ భారత్
– నేటి నుంచి అండర్-19 ప్రపంచకప్
జొహనెస్‌బర్గ్ : ఐసీసీ 15వ అండర్-19 మెన్స్ ప్రపంచకప్ నేటి నుంచి ఆరంభం కానుంది. శ్రీలంకలో జరగాల్సిన ఈ జూనియర్ వరల్డ్‌కప్.. ఇటీవల ఆ దేశ క్రికెట్ బోర్డుపై ఐసీసీ సస్పెన్షన్ వేటు విధించటంతో దక్షిణాఫ్రికాకు మారింది. 16 జట్లు పోటీపడతున్న మెగా ఈవెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ యువ భారత్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఐదుసార్లు (2000, 2008, 2012, 2018, 2022) అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్.. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. నేడు ఐర్లాండ్, అమెరికా పోరుతో వరల్డ్‌కప్ షురూ కానుండగా.. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఫిబ్రవరి 11న ఫైనల్ షెడ్యూల్ చేశారు. 16 జట్లు గ్రూప్ దశలో నాలుగేసి జట్లతో నాలుగు గ్రూపులుగా ఆడనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లు సూపర్‌సిక్స్‌కు చేరుకుంటాయి. ఇక్కడ 12 జట్లు ఆరేసి జట్లుగా రెండు గ్రూపుల్లో పోటీపడతాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. శనివారం బంగ్లాదేశ్‌తో పోరుతో టీమ్ ఇండియా టైటిల్ డిఫెన్స్ మొదలుపెట్టనుంది.