వామపక్ష ప్రజాస్వామిక ,లౌకిక సామాజిక శక్తులను గెలిపించండి

– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
ఈ నెల 30న జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్యక, లౌకిక, సామాజిక శక్తులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు కోరారు. మంగళవారం ఆలేరు మండల కేంద్రంలో ఎలగందుల మినీ ఫంక్షన్‌ హాల్‌ లో సీపీఐ(ఎం) ఆలేరు నియోజకవర్గం సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని రానివ్వకుండా నిలువరించేందుకు సీపీఐ(ఎం) నాయకత్వం కషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వలు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, కేవలం డబ్బులు, మద్యం ప్రజల్లోకి విచ్చలవిడిగా తీసుకెళ్లి గెలవాలని ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ,బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలన్నీ ఒకే తాటికి చెందినవన్నారు. సీపీఐ(ఎం) పోటీ చేస్తున్న చోటా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) పోటీ చేయని చోటా వామపక్ష ప్రజాతంత్ర శక్తులు, సామాజిక శక్తులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్‌ గౌడ్‌, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, నాయకులు బబ్బురి పోశెట్టి, ఎంఏ. ఇక్బాల్‌, దుపటి వెంకటేష్‌ ,బొలగాని జయరాములు, మద్దెపురం రాజు ,రేకల శ్రీశైలం, వేముల బిక్షం , పోతరాజు జహంగీర్‌ ,బబ్బురి శ్రీనివాస,్‌ తదితరులు పాల్గొన్నారు.