అబర్న్‌ యూనివర్సిటీతో

– తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అమెరికాలోని అబర్న్‌ యూనివర్సిటీతో తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ ఒప్పందం చేసుకుంది. ఏటా ఇద్దరు ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్థులకు పూర్తి ఫండింగ్‌తో మాస్టర్స్‌ డిగ్రీ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ తెలిపారు. అబర్న్‌ యూనివర్సిటీలో శనివారంనాడామె తెలంగాణకు హరితహారంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎస్‌సీఆర్‌ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ చదివిన విద్యార్థుల్లో ఏటా ఇద్దరికి ఎమ్సెస్సీ ఫారెస్ట్రీ కోసం పూర్తి ఫండింగ్‌ ఇచ్చేందుకు అబర్న్‌ యాజమాన్యం అంగీకరించిందని ఆమె తెలిపారు. ఈ మేరకు అబర్న్‌ యూనివర్సిటీ ఫారెస్ట్రీ కాలేజీ డీన్‌ డాక్టర్‌ జానకి అలవలపాటితో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశామన్నారు. కార్యక్రమంలో అబర్న్‌ యూనివర్సిటీ ప్రతినిధులు విన్నీ నాథన్‌, డాక్టర్‌ క్రిస్టోఫర్‌ రాబర్ట్స్‌, బ్రెట్‌ వైట్‌ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్‌ ప్రాజెక్టులపై సీఎం దృష్టి
రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు యుద్దప్రాతిపదికన నిధులు కేటాయించి కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా, నెట్టెంపాడు పూర్తి చేయించారనీ, జూరాల కింద ప్రతిపాదించిన మొత్తానికి సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదనీ, తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్నీ ప్రారంభించారని తెలిపారు. దీనివల్ల ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.