పసందైన వంటలతో…

With delicious dishes...దసరా పండుగ అంటేనే సరదా సందడి నెలకొంటుంది. ఆ రోజు ఇల్లంతా బంధువులతో నిండి ఉంటుంది. ఇక వంటల గురించి చెప్పక్కర్లేదు. రకరకాల ఆహార పదార్థాలతో విందు కచ్చితం.. మరి ఆ రోజుకు కొంచెం వెరైటీగా డిషెస్‌ ప్లాన్‌ చేద్దామా ఈ సారి…
కోవా గోధుమరవ్వ కేసరి
కావాల్సిన పదార్థాలు : గోధుమరవ్వ – గ్లాసు, నెయ్యి – అరకప్పు, బెల్లం తరుగు – గ్లాసు, జీడిపప్పు – పది, యాలకులపొడి – అరచెంచా, కోవా – పావుకప్పు, పాలు – గ్లాను.
తయారు చేసే విధానం : కడాయిలో సగం నెయ్యి వేసి వేడి చేసి గోధుమరవ్వను వేయించుకుని తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. వేరే కడాయిలో బెల్లం తీసుకుని అది కరిగేలా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. బెల్లం కరిగి తీగ పాకం రానివ్వాలి. ఇంతలో మరో గిన్నెలో గోధుమరవ్వ, పాలు తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. రవ్వ ఉడికి, పాలు ఇంకిపోయాక దాన్ని బెల్లంపాకంలో వేసి కలపాలి. తర్వాత మిగిలిన పదార్థాలన్నీ వేసి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కేసరి దగ్గర పడుతుంది. అప్పుడే దింపేయాలి.
మెంతి పులిహోర
కావాల్సిన పదార్థాలు : బియ్యం – అర కిలో, చింతపండుగుజ్జు – నాలుగు చెంచాలు, బెల్లం తురుము – చెంచా, వేయించిన పల్లీలు : అర కప్పు, ఉప్పు – రుచికి సరిపడా
పొడి కోసం : శెనగపప్పు – నాలుగు చెంచాలు, ఎండుమిర్చి – ఎనిమిది, మెంతులు – చెంచా, మిరియాలు – రెండు చెంచాలు
తాలింపు కోసం : ఆవాలు -రెండు చెంచాలు, ఎండుమిర్చి – ఎనిమిది, శెనగ పప్పు – రెండు చెంచాలు, పసుపు – రెండు చెంచాలు, ఇంగువ – చెంచా, కరివేపాకు – 12 రెబ్బలు, నువ్వుల నూనె – రెండు వందల మిల్లీ లీటర్లు
తయారు చేసే విధానం : అన్నం ఉడికించి వెడల్పాటి బేసిన్‌లో వేసి కాస్త నూనె వేసి కలపాలి. పొడి కోసం తీసుకున్నవన్నీ వేయించి, చల్లారాక పొడి చేయాలి. కడాయిలో నూనె వేసి, ఆవాలు, శెనగపప్పు, ఎండుమిర్చి వేసి వేగాక, పసుపు, ఉప్పు, కరివేపాకు, ఇంగువ, చింతపండు గుజ్జు వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి, మిశ్రమం సగమయ్యే వరకూ మరిగించాలి. బెల్లం తురుము, పులిహోర పొడి వేసి చిక్కబడేవరకూ ఉంచి దించి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి పల్లీలు కూడా వేసి కలపాలి. పులుపు చూసుకుని చాలనిపిస్తే మిగిలిన మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది.
చిట్టి గారెలు
కావాల్సిన పదార్థాలు : మినప్పప్పు – కప్పు, బియ్యప్పిండి (బియ్యం నాలుగ్గంటలు నానబెట్టి కొద్దిగా ఆరనిచ్చి పిండి పట్టాలి) – మూడు కప్పులు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం : మినప్పప్పు నాలుగైదు గంటలు నాననివ్వాలి. ముందుగా మినప్పప్పు మెత్తగా రుబ్బి.. అందులో బియ్యప్పిండి, ఉప్పు కలపాలి. ముద్దను చిన్న ఉండలుగా చేసి తడి బట్ట మీద వేసి చిన్నచిన్న బూరెల్లా వత్తాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీస్తే చిట్టి గారెలు రెడీ.
మోరంగడ్డ వడలు
కావాల్సిన పదార్థాలు : మోరంగడ్డలు – రెండు, శెనగపిండి – అరకప్పు, బియ్యప్పిండి – రెండు చెంచాలు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద – రెండు చెంచాలు, కొత్తిమీర తురుము – పావు కప్పు, కరివేపాకు – నాలుగు రెమ్మలు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం : ముందుగా మోరంగడ్డలను ఉడికించి పొట్టు తీసేసి మెత్తగా చిదమాలి. దీన్ని ఓ గిన్నెలో వేసి అందులోనే అల్లం, పచ్చిమిర్చి ముద్ద, శెనగపిండి, బియ్యప్పిండి, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ ముద్దను చిన్న చిన్న వడల్లా చేసి, కాగిన నూనెలో వేయించి తీస్తే మోరంగడ్డ వడలు రెడీ.
రవ్వ పాయసం
కావాల్సిన పదార్థాలు : చిక్కని పాలు – లీటరు, సన్న గోధుమ రవ్వ – వంద గ్రాములు, చక్కెర : రెండొందల గ్రాములు, జీడిపప్పు – చెంచా, యాలకుల పొడి: పావు చెంచా, మంచినీళ్లు – కప్పు, నెయ్యి – రెండు చెంచాలు, ఎండుద్రాక్ష – చెంచా
తయారు చేసే విధానం : కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన నెయ్యి వేసి రవ్వను పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. మందపాటి కడాయిలో సుమారు రెండొందల మిల్లీలీటర్ల నీళ్లు పోసి మరిగించాలి. వేయించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా ఉడికించాలి. పంచదార వేసి మరో రెండుమూడు నిమిషాలు ఉడికించి దించాలి. ఇప్పుడు విడిగా మరిగించిన పాలు పోసి, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి కలిపితే రవ్వ పాయసం రెడీ.