– ఆత్మహత్యకు యత్నించిన.. హౌంగార్డు మృతి
నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
హైదరాబాద్‌లోని గోషామహల్ లో మంగళవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన హౌంగార్డు రవీందర్ బుధవారం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్నేండ్లుగా హౌంగార్డ్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ నెల వేతనం సకాలంలో అందకపోవడంతో రవీందర్ మంగళ వారం గోషామహల్‌లోని హౌంగార్డు కమాండెంట్ ఆఫీస్‌కు వెళ్లాడు. అక్కడ పై అధికారులను తన వేతనం గురించి అడగ్గా చెక్కులు పంపించామని.. ఒకటి లేదా రెండు రోజుల్లో వేతనం జమవుతుందని చెప్పినట్టు తెలిసింది. అయితే, వేతనం ఆలస్యమవడంతో బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్య మైందన్న మనస్తాపంతో ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన రవీందర్.. పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించు కున్నాడు. గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రవీందర్ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.