వ్యక్తిగత ప్రయోజనాలతో

– బదిలీల షెడ్యూల్‌ను ఆటంకపర్చొద్దు
–  అడ్డుకునే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి : టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వ్యక్తిగత ప్రయోజనాలతో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ను ఆటంక పర్చొద్దని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) టీచర్లను కోరింది. అకారణంగా ప్రస్తుత బదిలీల షెడ్యూల్‌ను అడ్డుకునే వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదేండ్లుగా పదోన్నతులు, బదిలీల్లేక ఉపాధ్యాయులు, విద్యార్థులకు తీరని నష్టం జరుగుతున్నదని తెలిపారు.
షెడ్యూల్‌ విడుదలైన తర్వాత కూడా ఎనిమిది నెలలుగా రేపోమాపో బదిలీలు, పదోన్నతులు అవుతాయంటూ ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు దాన్ని ఏదోరకంగా ఆటంకం కలిగించేలా, సమస్యాత్మకం చేసి స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ కొందరు ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు ప్రయత్నాలు చేయడం శోచనీయమని విమర్శించారు. ఇలాంటి ప్రయత్నాలు సామాన్య ఉపాధ్యాయులను, విద్యారంగ ప్రయోజనాలని దెబ్బతీస్తాయని వారు తెలిపారు. ఎన్నికల డ్యూటీని సాకుగా చూపుతూ లాంగ్‌ స్టాండింగ్‌ అయిన పాఠశాలల నుంచి బదిలీని తప్పించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా సాంకేతిక కారణాలు చూపి కోర్టు ఉత్తర్యుల ద్వారా ప్రస్తుత బదిలీల నుంచి మేడ్చల్‌ జిల్లాలోని కొందరు ప్రధానోపాధ్యాయులు (సత్యప్రసాద్‌, అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌, రవికిరణ్‌, రాంరెడ్డి, కిషన్‌) మినహాయింపు పొందడం సోదర ప్రధానోపాధ్యాయులను నివ్వెరపరుస్తున్నదని పేర్కొన్నారు.
ప్రధానోపాధ్యా యులెవరైనా ఎన్నికల విధుల్లో ఉన్నట్టయితే దానికి ఆటంకం కలుగకుండా ఎన్నికల విధులు ముగిసిన తర్వాత కొత్త స్థానంలో చేరేటట్టు ఉత్తర్వులు ఇవ్వొచ్చని సూచించారు. అధికారులు ఆ విధంగా కోర్టును ఒప్పించే ప్రయత్నం చేయాలని కోరారు. అయితే తాము చేసిన సూచనను సైతం విద్యాశాఖ సంచాలకుల స్థాయి అధికారులు పట్టించుకోకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని విమర్శించారు. ఇలాంటి ఉత్తర్వుల కోసం మరికొంత మంది కోర్టు బాట పట్టే ప్రమాదం కనిపిస్తున్నదనీ, ఇది షెడ్యూల్‌పై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుందేమోననే ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మరి కొందరు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాపై కోర్టులో కేసులు వేశారని పేర్కొన్నారు. సీనియార్టీ జాబితా సిద్ధం కాకుండానే, అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉన్నా వాటిని వినియోగించు కోకుండా హైకోర్టును ఆశ్రయించటం సమంజసంగా లేదని తెలిపారు.
అధికారులు అడ్డుకట్ట వేయాలి
సెక్టోరియల్‌ ఆఫీసర్‌గా మూడేండ్ల కాలానికి బదిలీపై వెళ్లిన మేడ్చల్‌ జిల్లా కౌకూరు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు ఆర్నెల్లు తిరగకుండానే దాన్ని రద్దు చేయించుకుని తిరిగి కౌకూరు పాఠశాలలోనే చేరారని వారు పేర్కొన్నారు. ఇది లాంగ్‌ స్టాండిరగ్‌ బదిలీని తప్పించుకోవడానికేనని స్పష్టమ వుతున్నదని తెలిపారు. మూడేండ్ల కాలానికి విధుల్లో చేరిన వారిని డైరెక్టరేట్‌ అధికారులు ఆర్నెల్లలోనే ఎందుకు రిలీవ్‌ చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. లాంగ్‌ స్టాండింగ్‌గా ఆ పాఠశాలలో ఐదేండ్లు పూర్తైనం దున సెక్టోరియల్‌ అధికారిగా వెళ్లి మళ్లీ అక్కడే చేరడంతో లాంగ్‌ స్టాండిరగ్‌ బ్రేక్‌ అయ్యి, తిరిగి మరో ఐదేండ్లు అక్కడ ఉండేందుకే ఆ హెచ్‌ఎం పన్నిన పన్నాగాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు అర్థం చేసుకోకపోవడం విడ్డూర మని విమర్శించారు. సంచాలకుల స్థాయి అధికారులు ఇలాంటి వాటికి అడ్డు కట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యక్తిగత ప్రయోజ నాల కోసం ఉత్తర్వుల్లోని సాంకేతిక అంశాల అభ్యంతరాలతో ఆటంకం కలి గించే వారిపట్ల ముఖ్యమైన బదిలీలు, పదోన్నతుల సమయం లో సాను కూలత ప్రదర్శించడం మిగతా ఉపాధ్యాయులకు తీరని నష్టం కలిగి స్తుందని తెలిపారు. వ్యక్తిగత స్వార్థంతో బదిలీలు, పదోన్నతులకు ఆటంకాలు కల్పించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.