మావోయిస్టుల సంస్మరణ దినోత్సవాలతో

– పోలీసు శాఖ అప్రమత్తం
– రాష్ట్ర సరిహద్దుల్లో పెరిగిన కూంబింగ్‌ ఆపరేషన్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మావోయిస్టుల సంస్మరణ దినోత్సవాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో పోలీసు యంత్రాగాన్ని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. వారంపాటు సాగే మావోయిస్టు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా మిలిటెంట్లు ఏదేనీ విధ్వంసానికి పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలకు ఆనుకొని ఉన్న రాష్ట్రానికి చెందిన సరిహద్దు ప్రాంతాల్లో సాయుధ పోలీసు బలగాలతో కూంబింగ్‌ ఆపరేషన్‌ను అధికారులు విస్తృతం చేశారు. ముఖ్యంగా, గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో గ్రేహౌండ్స్‌ బలగాలు గాలింపు చర్యలు చేపట్టటంతో పాటు అనుమానిత తండాలపై కన్నేసి ఉంచారు. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణలోని నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల ఎస్పీలతో పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ తమ ఉనికిని చాటుకోవటానికి మావోయిస్టులు ఏదేనీ సంచలనాత్మక చర్యకు పాల్పడే ప్రమాదమున్నదని కూడా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ, అలాగే మారుమూల ప్రాంతాలకు ఈ వారం పాటు రాజకీయ ప్రముఖులు మొదలుకొని వీఐపీలు ఎవరూ వెళ్లరాదని కూడా హెచ్చరికలు చేసినట్టు తెలిసింది.