ఏజెన్సీలో గిరిజన ఉపాధ్యాయులతోనే

With the tribal teachers in the agency– పదోన్నతలు, నియామకాలు చేపట్టాలి : టీటీయూ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ (ఏజెన్సీ) ప్రాంతాల్లో వివిధ శాఖల కింద నిర్వహిస్తున్న పాఠశాలల్లో గిరిజన ఉపాధ్యాయులతోనే పదోన్నతులు, నియామకాలు చేపట్టాలని ట్రైబల్‌ టీచర్స్‌ యూనియన్స్‌ (టీటీయూ) జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం ఆ శాఖ జేడీ ఈ సందర్భంగా టీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.రామారావు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఆర్టికల్‌ 244 (1) అనుసరించి ఐదో షెడ్యూల్‌లో ఏజెన్సీ ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. షెడ్యూల్‌ ఏరియా ప్రాంతాల్లో షెడ్యూల్డ్‌ ట్రైబల్స్‌ కి చట్టాలు, హక్కుల రక్షణ కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 28 శాఖల్లో ఉద్యోగ నియామకాలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. ఇందులో విద్యాశాఖకు సంబంధించిన జీవో నెంబర్‌ 3ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఇందిరా సహానీ తీర్పులో ప్రస్తావించిన 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే దాంట్లో ఎక్కడా ఐదవ షెడ్యూల్‌ ప్రాంతం గురించి ప్రస్తావించలేదని గుర్తుచేశారు. అయితే ఈ తీర్పు షెడ్యూల్డ్‌ ప్రాంతానికి వ్యతిరేకమైన తీర్పుగా భావించిన ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. తెలంగాణ ఏటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను ఏజెన్సీ, మైదాన ప్రాంతాన్ని కలుపుకుని జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ యూనిట్‌గా పదోన్నతులు, బదిలీలు చేపడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఐదో షెడ్యూల్‌ లోని చట్టానికి, విరుద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులతోనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలనీ, అప్పటి వరకు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ జాదవ్‌, టీటీఎఫ్‌ ఉపాధ్యక్షులు ఎన్‌.భీమ్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.