నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారని ప్రగతి శీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షులు జి ఝాన్సీ బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రధాని మోడీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు, నారీ శక్తి వందన చట్టం (మహిళా రిజర్వేషన్ బిల్లు) బీజేపీ వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకేనని తెలిపారు.
ప్రభుత్వ అనుకూల మీడియా దీన్ని ‘బహుమతి’గా ప్రచారం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నిజానికి ఎన్నో ఏండ్లుగా తిరస్కరిస్తున్న మహిళల హక్కు అని పేర్కొన్నారు. బిల్లును జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌తో ముడిపెట్టటమేంటని ప్రశ్నించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు సబ్ కోటాతో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించేలా సవరణ చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ, విధానసభలకే పరిమితం కాకుండా రాజ్యసభ, విధాన పరిషత్‌లకు కూడా వర్తింపజేయాలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లోనే మహిళలు రాజకీయ నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని వినియోగించుకునేలా సవరణ బిల్లును అమలు చేసే ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.