ఎన్నికల ఎత్తుగడతో మహిళా బిల్లు

Women's Bill with electoral moves– బీసీలను కరివేపాకులా వాడే పార్టీలకు బుద్ధి చెప్పాలి
– కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు? :
– మహిళా బిల్లులో బీసీల సబ్‌కోటాపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆగమేఘాలమీద తీసుకొచ్చిందని వక్తలు విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో ‘మహిళా బిల్లులో..బీసీ సబ్‌ కోటా’ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష పార్టీలు-బీసీ కుల సంఘాలతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు.
బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మెన్‌ కుందారం గణేష్‌చారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ పార్లమెంట్‌ సభ్యులు వి హనుమంతరావు, పీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్‌, నాగేందర్‌ గౌడ్‌, డిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్‌ మహారాజ్‌, తెలంగాణ జన సమితి అధికార ప్రతినిధి పల్లె వినరు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ, తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరా శోభన్‌, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్‌, గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మెన్‌ బాలగోని బాలరాజ్‌ గౌడ్‌, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మని మంజరి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మా, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌ గౌడ్‌, బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నగేష్‌, ఓ యు జేఏసీ నాయకురాలు బాలలక్ష్మి, మహిళా రాష్ట్ర నాయకురాలు తిరుపతమ్మ, ఈడిగ శ్రీనివాస్‌ గౌడ్‌, శ్యామల, మాధవి, వరికుప్పల మధు, కవుల జగన్నాధం శ్రీనివాస్‌ కుర్మా తో పాటు 80 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, 25 బీసీ సంఘాల అధ్యక్షులు, ఉద్యోగ ఉపాధ్యాయ మహిళా విద్యార్థి యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలను కూరలో కర్వేపాకులా వాడే పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని బీసీలకు సూచించారు. ఎన్నికల వేళ భారత నారీశక్తుల సత్తాను ఓట్ల రూపంలో తెలిపే సందర్భం వచ్చిందని చెప్పారు. మహిళా బిల్లుతో మరో సారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల అస్త్రంగా మనువాద పాలకుల కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఆధిపత్య కులాల స్త్రీలను అధికార పీఠాల మీద కూర్చొబెట్టేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని తెలిపారు.
బీసీ మహిళల గణన జరపకుండా… 33 శాతం మహిళా బిల్లులో మా వాటా ఎంతో తేల్చకుండా ఎట్లా అమలు చేస్తారని ప్రశ్నించారు. తక్షణం బీసీల జనాభా లెక్కలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తమ వాటా కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో వేలాది మంది మహిళలతో జంగు సైరన్‌ పేరుతో భారీ బహిరం సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 28 రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు.
పార్లమెంట్లో ప్రాతిథ్యం ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులను, ముఖ్యమంత్రులను కలిసి బీసీ బిల్లుకు మద్దతు కూడగడతామన్నారు. కోటి మంది మహిళల స్వదస్తూరితో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాయాలనీ, ఐ సపోర్ట్‌ బీసీ ఉమెన్‌ బిల్‌ పేరుతో సోషల్‌ మీడియా ద్వారా ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానాలు చేశారు.