మాటే మంత్రమూ…

మాటలు కరువై పోయిన సమాజంలో మనం బతుకుతున్నాం. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చాలా అవసరం. అందులోనూ భార్యామాటలు కరువై పోయిన సమాజంలో మనం బతుకుతున్నాం. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చాలా అవసరం. అందులోనూ భార్యా భర్తలు మాట్లాడుకోవడం మరింత అసరం. లేదంటే ఆ ప్రభావం కుటుంబం మొత్తంపై పడుతుంది. అదే మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. మాటలకు అంతటి బలం ఉంటుంది మరీ! ఇంతకీ ఈ మాటల గురించి ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా? దంపతుల మధ్య మాటలు కరువైతే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
రాజుకు 48 ఏండ్లు ఉంటాయి. ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలున్నారు. అతని భార్య రాధిక కూడా ఉద్యోగం చేస్తుంది. రాజు తల్లిదండ్రులు కూడా వీరితో పాటే ఉంటారు. రాధిక జీతం కూడా రాజునే తీసుకుంటాడు. ఆమెకు ఏదైనా అవసరముంటే ఇస్తాడు. సరుకులు తీసుకురావడం, పిల్లల ఫీజులు, వాళ్ళ అమ్మనాన్న ఆస్పత్రి ఖర్చులు, ఏదైనా ఫంక్షన్‌కు వెళ్ళడం లాంటివన్నీ రాజునే చూసుకుంటాడు. రాధిక అసలు ఎలాంటి విషయాల్లోనూ జోక్యం చేసుకోదు. అతను కూడా ఆమెతో పంచుకోండు. ఉద్యోగం చేయడం, వచ్చిన జీతం రాజుకు ఇవ్వడం మాత్రమే చేస్తుంది. అత్తమామలను బాగా చూసుకుంటుంది. పిల్లలకు కావల్సినవన్నీ చేసి పెడుతుంది. రాజుకు ఎదురు మాట్లాడదు. ఎప్పుడైనా బాగా కోపం వచ్చినప్పుడు మాత్రం గట్టిగా అరుస్తుంది. మళ్లీ కాసేపట్లో మామూలైపోతుంది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ రాజుతో ఈ మధ్య రాధిక అస్సలు మాట్లాడడం లేదు. ఆమెతో మాట్లాడి తన సమస్య పరిష్కరించుకోవడం కోసం ఐద్వా అదాలత్‌కు వచ్చి…
‘మేడమ్‌ నా భార్య నాకు కావలసినవన్నీ చేసి పెడుతుంది. అడక్కుండానే భోజనం పెడుతుంది. కానీ నా నుండి మాత్రం ఏ సహాయం తీసుకోవడం లేదు. ఇంతకు ముందు వంటగదిలో ఏదైనా వస్తువు అందకపోతే నన్ను పిలిచేది. కానీ ఇప్పుడు కుర్చీవేసుకొని తనే తీసుకుంటుంది. ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. వాళ్ల పెద్దవాళ్ళతో అడిగించినా ఏమీ చెప్పడం లేదు. మా అమ్మానాన్నతో మాత్రం మంచిగా ఉంటుంది. ఏం చేయాలో తోచక మీ సలహా కోసం వచ్చాను’ అని చెప్పాడు.
రాజు చెప్పింది విన్న తర్వాత మేము రాధికను పిలిపించాము. కానీ ఆమె మాతో కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. ‘ఏం లేదు మేడమ్‌ మేము బాగానే ఉన్నాం. రాజుకు కావల్సినవన్నీ అడక్క ముందే తెచ్చి ముందు పెడుతున్నాను. నా జీతం మొత్తం ఆయనకే ఇస్తున్నాను. నాకేదైనా అవసరం అయితే తీసుకుంటాను. లేకపోతే లేదు. ఈ మధ్య కాలంలో అది కూడా మానేశాను. వాళ్ళ అమ్మానాన్నలను, ఇంటికి వచ్చిన బంధువులను అందరినీ బాగానే చూసుకుంటున్నాను. ఇంకా ఏం కావాలని ఇక్కడి వరకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు. నేను ఏ విషయంలో పొరపాటు చేస్తున్నానో చెప్పమనండి సరిచేసుకుంటాను’ అంది.
దానికి రాజు ‘నాతో ఎందుకు మాట్లాడడం లేదు. పోనీ నేను ఏదైనా పొరపాటు చేస్తే చెప్పు సరి చేసుకుంటాను’ అన్నాడు. ‘ఇన్నేండ్ల తర్వాత మీరు చేసే పొరపాట్ల గురించి చెప్పి మిమ్మల్ని సరిచేసే ఓపిక నాకు లేదు. నేను ఏది చేసినా, ఏది మాట్లాడినా తప్పే అన్నట్టుగా రాజు మాట్లాడతాడు. పెండ్లయి 23 ఏండ్లు అవుతుంది. ఇప్పటికి కూడా నేను ఏది చెప్పినా అసలు వినరు, పట్టించుకోరు. ఏ విషయం చెప్పాలన్నా కనీసం రెండు నిమిషాలు కూడా కేటాయించరు. నేనేదైనా అడిగినా సమాధానం చెప్పరు. నేనంటే లెక్కేలేదు. పాపకు ఇప్పుడు 22 ఏండ్లు వచ్చాయి. త్వరలో పెండ్లి చేయాలి. నేను జాబ్‌ చేసే డబ్బుతో ఓ ఇల్లు తీసుకుంటే ఆమెకు ఉపయోగపడుతుంది కదా! మిగిలిన డబ్బులు పాప పెండ్లికి వస్తాయి కదా! ఈ విషయాల గురించి మాట్లాడదామంటే నాకు తెలివి లేదన్నట్టు ప్రవర్తిస్తారు. ఏమైనా అంటే అరుస్తుంది అంటారు. ఎన్ని సార్లు అడిగినా సమాధానం చెప్పరు. అలాంటి టైంలోనే నేను అరుస్తాను. ఊరికే ఎందుకు అరుస్తాను. పిల్లలతో మీ అమ్మకు ఏమీ తెలియదు, ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుంది, అరుస్తుంది అని చెప్తుంటారు. నేను ఉద్యోగం చేయాలి. ఇంట్లో పనులు కూడా చేసి పెట్టాలి. అక్కడ కూడా ఎలాంటి సహాయం చేయరు. ఏదైనా వస్తువు అందకపోతే తీసి ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు.
పిల్లలతో కూడా ఆయన పెద్దగా మాట్లాడరు. ఎప్పుడూ ఫోన్‌ చూసుకుంటూ కూర్చుంటారు. ఆ ఫోన్‌ పని చేయక వారం అవుతుంది. అందుకే నేను మాట్లాడడం లేదనే విషయం గుర్తొచ్చినట్టుంది. కానీ ఆయన ఫోన్‌ పిచ్చిలో పడి మమ్మల్ని ఎప్పుడో దూరం చేసుకున్నారు. ఆయనకు చెప్పినా ఎలాంటి ఉపయోగం లేదని ఈ మద్యనే మా స్నేహితులతో కలిసి మా పాప కోసం ఓ ఇల్లు కొన్నాను. మిగిలిన డబ్బు వేరే చోట ఇన్వెస్ట్‌ చేశాను. ఇక బాబు కాలేజీలో అమ్మాయిలను ప్రేమించమంటూ ఇబ్బంది పెడుతున్నాడని ప్రిన్సిపల్‌ కంప్లెయింట్‌ ఇచ్చారు. కనీసం ఆ విషయం గురించి అయినా మాట్లాడాలి కదా. అది కూడా చెయ్యరు. నేను చెప్పినా పట్టించుకోలేదు. నేనొక్కదాన్నే వెళ్ళి మాట్లాడి వచ్చాను. అసలు ఆయన ఏ విషయం గురించి కూడా సరిగ్గా పట్టించుకోరు. నేను మాట్లాడినా వినిపించుకోరు. అందుకే మాట్లాడడమే మానేశాను. మాట్లాడినా తప్పే, మాట్లాడక పోయినా తప్పే అన్నట్టు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పటికే జీవితం సగం అయిపోయింది. ఇప్పుడైనా మారాలి కదా? రాజు మారడం లేదు. కాబట్టి నేనే మారాలని నిర్ణయించుకున్నాను’ అంటూ ఏడుస్తూ చెప్పింది రాధిక.
రాధిక ఎంతో ఆవేదనతో చెప్పిన విషయాలన్నీ విని రాజుతో ‘భార్యా భర్తలు ఇంటి విషయాల గురించి మాట్లాడుకోవడం, బాధ్యతలు పంచుకోవడం చాలా అవసరం. రాధిక లాంటి వ్యక్తి మీకు భార్యగా దొరకడం మీ అదృష్టం. ఆమె ఏదైనా విషయం చెప్పినప్పుడు వినడం నేర్చుకోండి. భార్య, భర్తలు ఏ విషయాలైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. ప్రతి విషయాన్ని పంచుకోవాలి. అది మీ కుటుంబానికి చాలా మంచిది. ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. మీరు మాట్లాడే ఒక్క మాతో రాధికలో ధైర్యం నింపుతుంది. ఆమెపై మీకున్న ప్రేమను తెలియజేస్తుంది. ప్రతి మహిళ తన బాధలు, సంతోషాలు భర్తతోనే చెప్పుకోవాలనుకుంటుంది. కానీ మీరు మాత్రం దానికి అవకాశమే ఇవ్వడం లేదు. ఓపిక నశించి ఈ రోజు ఆమె మీతో మాట్లాడడమే మానేసింది. కనుక ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆమెతో మనసు విప్పి మాట్లాడండి. ఆమె చెప్పేది వినండి’ అని చెప్పాము.
‘నావల్ల రాధిక ఇంత బాధపడు తుందని అర్థం చేసుకోలేకపోయాను. ఇక నుండి కచ్చితంగా తనలో మాట్లాడతాను. తను చెప్పింది వింటాను’ అని చెప్పి రాధికను తీసుకెళ్ళాడు.
– వై వరలక్ష్మి, 9948794051