కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Workers' problems should be solved– జీహెచ్‌ఎంసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌
– కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌కు వినతిపత్రం

నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
జీహెచ్‌ఎంసీలో 25 ఏండ్లుగా పలు కేటగిరిల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. జేఏసీ నేతలు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, నేతలు జె.వెంకటేష్‌, ఇ.అంజయ్య, శ్రావణ్‌, వాణి, ఏఐటీయూసీ నేతలు ఏసురత్నం, జైపాల్‌ రెడ్డి, వెంకన్న తదితరులు సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. కనీస వేతనాల పెంపు, ఐఆర్‌, ప్రమాద బీమా, అన్ని కేటగిరీల ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలుకు చర్యలు తీసుకుంటామని జేఏసీ నేతలతో జరిగిన చర్చల్లో కమిషనర్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య, మలేరియా, ట్రాన్స్‌ పోర్టు ఇతర విభాగాల్లోని కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాలు, పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలు, డిమాండ్లపై చర్చించినట్టు తెలిపారు. నగరంలో పారిశుధ్యం నిర్వహణలో ఎంతగానో శ్రమిస్తున్న కార్మికులు, కేటగిరీ ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో కోటి మందికి పైగా ఉన్న నగర ప్రజానీకానికి మెరుగైన పారిశుధ్య సేవలు అందించడం వల్ల జీహెచ్‌ఎంసీకి దేశంలో అనేక ఉత్తమ అవార్డులు వచ్చాయన్నారు. జీహెచ్‌ఎంసీ కార్మికులు పని భారం, వేధింపులతో నిత్యం సతమతమవుతున్నారని, ఈ నేపథ్యంలో వారి న్యాయమైన సమస్యలు, డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.