పొద్దుటూరు నుంచి సీఎం కేసీఆర్‌ ఫోటోలతో సైకిల్‌యాత్ర

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పొద్దుటూరుకు చెందిన పెయింటింగ్‌ ఆర్టిస్ట్‌ తుపాకుల రామాంజనేయరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై అభిమానంతో సైకిల్‌ యాత్ర చేపట్టారు. సైకిల్‌పై ఆయనే స్వయంగా గీసిన కేసీఆర్‌ చిత్రపటాలను ఉంచి, వారం రోజుల పాటు ప్రయాణం చేసి శుక్రవారం హైదరాబాద్‌కు చేరారు. మంత్రి కే తారకరామారావు ఆర్టిస్టు బృందాన్ని ప్రగతిభవన్‌కు సాదరంగా ఆహ్వానించారు. దివ్యాంగుడుగా అనేక కష్టాలు అనుభవించి స్వయంకృషితో పెయింటింగ్‌ ఆర్టిస్ట్‌గా ఎదిగిన తుపాకుల రామాంజనేయరెడ్డిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. 20 రోజులు కష్టపడి కాన్వాస్‌ మీద ఆక్రిలిత్‌తో పాటు గండికోట మట్టితో మోనో కలర్‌లో చిత్రించిన సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పెయింటింగ్‌ను రామాంజనేయ రెడ్డి కేటీఆర్‌కు అందచేశారు.