వైసీపీ కార్యకర్తల్లా ఏపీ పోలీసుల తీరు

YCP activists are like AP police– కుట్రతోనే చంద్రబాబుపై కేసు
– ఎన్టీఆర్‌భవన్‌లో టీడీపీ శ్రేణుల నిరసన దీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ పిలుపు మేరకు సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన దీక్షను కొనసాగించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. నల్లరిబ్బన్‌ ధరించారు. ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని విమర్శించారు. చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపిన నేపథ్యంలో 13మంది అభిమానులు గుండె ఆగి మరణించారని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, పి.అరవింద్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఒకవైపు ప్రజలకు భరోసా ఇస్తూ చంద్రబాబు, మరో వైపు పాదయాత్ర చేస్తూ నారా లోకేష్‌ ప్రజలలో తిరుగుతున్న నేపథ్యమే కంటగింపుగా మారిందని అన్నారు. దీంతోనే వారికి ఆటంకాలు సష్టిస్తూ..రాళ్లు రువ్వడం వంటి వికత చేష్టలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని విమర్శించారు. చంద్రబాబు నంద్యాలలో బస్సులో నిద్రిస్తుండగా, నిద్రలేపి కొన్ని గంటల పాటు రకరకాలుగా అవమానించారని విమర్శించారు. పోలీసు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాజ్యాంగం అపహాస్యం పాలైందని అభిప్రాయపడ్డారు. వికత పరిపాలన చేస్తున్న జగన్‌కు ఏపీ ప్రజలు తొందరలోనే బుద్దిచెబుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆది, సోమవారాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్షలను చేపట్టారని చెప్పారు. ఆదివారం చంద్రబాబు, భువనేశ్వరి వివాహం రోజున ఆక్రమ కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసిన జగన్‌కు తప్పకుండా ఆ పాపం తగులుతుందని అన్నారు. జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు , జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి బి. జ్యోత్స్ప, జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్‌ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, సామ భూపాల్‌ రెడ్డి, బండి పుల్లయ్య, డాక్టర్‌ వాసిరెడ్డి రామనాథం, పి.చంద్రయ్య, టీజీకే మూర్తి, ప్రధాన కార్యదర్శులు ఎ.కె. గంగాధర్‌, అజ్మీర రాజునాయక్‌, జక్కలి ఐలయ్య యాదవ్‌, గడ్డి పద్మావతి, జీవీజీ నాయుడు, షేక్‌ ఆరీఫ్‌, అధికార ప్రతినిధులు మ్యాడం రామేశ్వరరావు, ముప్పిడి గోపల్‌, తెలుగు మహిళ అధ్యక్షుఆలు భవనం షకిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.