అస్తిత్వ హృదయం-హైదరాబాద్‌!

తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ తాత్వికతలో హైదరాబాద్‌ నగరానిది హదయస్థానం. ఘనమైన చారిత్రక వారసత్వం, భిన్న సంస్కతుల సహజీవనం, గంగాజమునా తెహజీబ్‌తో నిత్యచైతన్య స్రవంతికి వేదిక ఈ నగరం. కులీ-భాగమతి ప్రేమకు చిహ్నంగా భావించే.. ఈ అపురూపమైన నగరంపట్ల తెలంగాణ కవులు చెప్పలేని అభిమానాన్ని చాటారు. హైదరాబాద్‌ చారిత్రక జ్ఞాపకాలనూ, అడుగడుగునా తారసపడే వైభవోపేత వారసత్వాన్ని గుర్తుచేసుకొని మురిసిపోయారు. ‘చిలుకల మేడ చార్మినారే లేకుంటే/ ఇంతకాలం చందమామ దీపంలా వెలిగేదికాదు.. హైదరాబాదు లేకుంటే మల్లెపందిరిలా అల్లుకొన్న/ ఆకాశం కూడా వుండేది కాదు’ (జిగర్‌. పుట 53) అంటూ ఈ మహానగరపు ఆత్మీయతను, దాని పునాదులైన వందల ఏళ్ల చారిత్రక స్మతులను ఆశారాజు పలువరిస్తాడు. ఘనమైన గతచరిత్రకు సాక్ష్యాలుగా నేటికీ నిలిచి ఉన్న చార్మినార్‌, లాడ్‌ బజార్‌, గుల్జార్‌హౌజ్‌, మూసీ నది, సాలర్‌జంగ్‌ మ్యూజియం, ఫలక్‌నామా, గోలకొండ కోట, దేవిడిలు, ఇరానీ హౌటళ్లు, నుమాయిష్‌.. ఇలా నిత్యజీవితంలో తారసపడే ఈ సాంస్కతిక ప్రతీకల్ని ఎంతో అపురూపంగా తన కవిత్వంలోకి ఎత్తుకున్నాడు.
కులమతాలకతీతంగా ప్రజలందరినీ అక్కున చేర్చుకునే తల్లి హైదరాబాద్‌ నగరం. హైదరాబాద్‌ ఒక కవల పిల్లల కన్నతల్లి/ పెద్దకొడుకు యాదగిరి రంజాన్‌ అంటాడు/ చిన్నవాడు దస్తగిరి దసరా అంటాడు/ ఆ తల్లికి మాత్రం ప్రతి రోజూ పండుగే” (జాగో.. జగావో. పుట 48) అంటాడు కవి అమ్మంగి వేణుగోపాల్‌. ఏ మతం వారైనా తన బిడ్డలపై వివక్ష చూపని తల్లి హైదరాబాద్‌ అని గుర్తుచేస్తూ… తానీషా కథలో అందరికీ రాముణ్ని చూపిస్తుంది/ తుర్రేబాజ్‌ ఖాన్‌ కథలో తిరుగుబాటు చెప్తుంది/ తాను మాత్రం మక్కా మసీదు పావురమై ఎగురుతుంది” అంటూ ఈ నగర చారిత్రక, సాంస్కతిక ఔన్నత్యాన్ని, పోరాట వారసత్వాన్ని చాటిచెప్తాడు. ఎందరెందరో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్‌లో జీవిస్తూ ఉంటారు. అలా బతకడానికి వచ్చిన వారిని ఏ భేదభావం లేకుండా అక్కున చేర్చుకునే ఈ నగరాన్ని ‘తోటి పిల్లలతో కొట్లాడి/ తలదాచుకోడానికొస్తే రెక్కల్లో దాచుకున్న తల్లికోడి’ అని తలుచుకుంటాడు ఎస్వీ సత్యనారాయణ. తన బాల్యపు జ్ఞాపకాలలో నిండిన ఇక్కడి సర్వమత సమదష్టిని నెమరువేసుకుంటూ.. వీధి భాగోతంలో చిందులేసే చిన్ని కష్ణుడైనా, పీర్ల పండుగనాడు దూల ఆడినా, బాల క్రీస్తు వేషం వేసినా, బోనాల పండుగలో కోయ నత్యం చేసినా.. హైదరాబాద్‌ ఒక తల్లిలా అందరినీ ఆదరించిన వైనాన్ని చిత్రిస్తాడు.
హైదరాబాద్‌ నగరమనగానే మొదట గుర్తుకొచ్చేది చార్మినార్‌ కట్టడమే. పురానీ షెహర్‌ (పాతబస్తీ) జీవితానికి ప్రతీక అయిన ఈ కట్టడాన్ని పేదవాని గుండెతో పోలుస్తాడు కవి అన్వర్‌. గరీబ్‌లోగోంకా అడ్డా – చార్మినార్‌/ గరీబ్‌ లోగోంకా హర్‌ ఏక్‌మాల్‌ – చార్మినార్‌” (జిగర్‌. పుట 43) అంటూ చార్మినార్‌ ఇక్కడి జీవితాల్లో ఎలా భాగమైందో చాటుతాడు. మైసమ్మ గుడిలో గంటల చప్పుడు, మసీదు అజా పిలుపులు కలిసిపోయి.. కులమతాలకు అతీతంగా హైదరాబాద్‌ సాంస్కతిక ప్రతీకగా చార్మినార్‌ ఠీవిగా నిలబడిన తీరును చిత్రిస్తాడు.
తెలంగాణ సంస్కతికి మేలిమి వన్నెలద్దిన మరో ముఖ్యాంశం.. ఇక్కడి సూఫీ సాంస్కతిక దశ్యం. మతాల కన్నా మనుషులే ముఖ్యమన్న తత్వం. హైదరాబాదే కాదు.. తెలంగాణా నలుచెరగులా కనిపించే ఈ నమ్మకాన్ని ఎలుగెత్తుతూ.. ”తెల తెల వారుతున్నప్పుడు/ దర్గా దయకోసం మోకరిల్లిన/ అన్ని మతాల వారినీ చూశాను” అంటూ కవి యాకూబ్‌ (తెలంగాణా కవిత 2009. పుట 86-87) తెలంగాణ ఆత్మలో భాగమైన బహుళ సంస్కతిని చాటుతాడు.
ప్రేమకు చిహ్నంగా అకురించిన హైదరాబాద్‌ నగర చారిత్రక మూలాలను స్పశిస్తూ.. ”ఒక తెలంగాణ తల్లి భాగీరథి/ ఒక తెలంగాణ ప్రేయసి భాగమతి/ తెలంగీ”ని హత్తుకున్న ప్రేమ ఫలాని” అంటారు సుంకిరెడ్డి నారాయణరెడ్డి (జిగర్‌. పుట 285). ఈ ఇద్దరి పేరు మీదగానే భాగ్యనగర్‌ నిర్మాణానికి పునాది వేసి.. తెలంగీని హత్తుకున్న కులీ కుతుబ్‌షాహి గొప్పతనాన్ని చాటిచెపుతాడు. ”కుమారగిరి సింగభూపాల/ కష్ణరాయల రాసిక్య/ రచనా పల్లకీల మోతల్లో/ నువ్వు లేవు గానీ/ తరాజు ముల్లు నీవైపే/ తొలి ఉర్దూ రాజకవీ” అంటూ సాహిత్య చరిత్ర రచనలో కులీని విస్మరించిన వైనాన్ని గుర్తుచేస్తాడు. స్వయంగా కవి అయిన కులీ ఉర్దూలో ‘ఖుల్లీయత్‌’ అనే కవితా సంపుటిని ప్రకటించి.. తొలి ఉర్దూ రాజకవిగా ఘనత వహించిన తీరును జ్ఞప్తికి తెస్తాడు.
”ఇరానీ చారు కమ్మదనపు రుచి/ హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమల ధూమాలు/ భూమి చుట్టూ సాంబ్రాణి పొగలై అలుముకుంటాయి” (జాగో.. జగావో. పుట 43) అంటూ షాజహానా తెలంగాణ అస్తిత్వానికి, ఔన్నత్యానికి ప్రధాన భూమికగా నిలిచిన ఈ నగరాన్ని హదయానికి హత్తుకుంటారు. మలిదశ ఉద్యమంలో హైదరాబాద్‌ ఎవరిది అన్న చర్చను ధిక్కరిస్తూ.. ఈ నగర మూలవాసులుగా, ఇక్కడ తరతరాలుగా నివసిస్తున్న ప్రజల వారస్వత హక్కుగా ఈ నగరం తమకే చెందుతుందని గొప్ప అస్తిత్వ చైతన్యంతో తెలంగాణ కవులు చాటారు. ఈ నగరం మీద ఎనలేని ప్రేమనే కాదు.. దీనిపై తమ హక్కును కూడా గొప్ప ఆత్మగౌరవంతో ప్రకటించుకున్నారు. ”బాజాప్తుగ భాగ్యనగరం మాదే/ గీ అవ్వల్‌ దర్జా హైద్రాబాద్‌/ మా వీర తెలంగాణది/ పోరు తెలంగాణది/ మా వేరు తెలంగాణది” ( జాగో.. జగావో. పుట 64) అంటారు జూపాక సుభద్ర. తెలంగాణ సంస్కతిలో, జీవనరీతిలో అంతర్లీనమైన హైదరాబాద్‌ ఎవరిదీ అనే ప్రశ్న మలిదశ ఉద్యమంలో రావడమే ఇప్పుడు పెద్ద ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణ అస్తిత్వాన్నే కాదు.. ఆ అస్తిత్వాన్ని మూలకేంద్రమైన హైదరాబాద్‌ నగరాన్ని కూడా గుండెలనిండా నింపుకొని.. తమ కవితాపతాకాలను ఎగరేశారు కవులు. తమ అస్తిత్వ వైభవంలో మణిహారమైన హైదరాబాద్‌ నగరాన్ని గొప్ప సాంస్కతిక అభినివేశంతో కవిత్వంలో పలికించి.. ఈ నగర ఘనతలను మరోసారి పునర్జీవింపజేశారు.
– కె. శ్రీకాంత్‌, 8008668285
పరిశోధక విద్యార్థి,
ఉస్మానియా యూనివర్సిటీ