నిన్న టమాటా…నేడు ఉల్లి

– ధరల ఘాటుతో మోడీ ఉక్కిరిబిక్కిరి
– ఎన్నికలపై ప్రభావం చూపవచ్చని ఆందోళన
– దిద్దుబాటు చర్యల్లో అధికారులు
న్యూఢిల్లీ : నిన్నటి వరకూ టమాటా ధరల సెగతో విలవిలలాడిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఉల్లి ఘాటుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉల్లి ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో ఆయన కలవరపాటుకు గురవుతున్నారు. ఇటీవల పెరిగిన టమాటా ధరల కారణంగా రాజకీయంగా జరిగిన నష్టంతో పోలిస్తే ఇప్పుడు ఉల్లి ధరల ఘాటు బాగా ఎక్కువగా ఉంది. ఐదు రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల ధరలతో ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందేమోనని బీజేపీ ఆందోళన చెందుతోంది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు.
ఉల్లి ఎగుమతులపై కేంద్రం 40% పన్ను విధించిన విషయం తెలిసిందే. మరోవైపు సబ్సిడీ రేటుతో స్థానిక మార్కెట్లలో ఉల్లిని విక్రయించి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు దిగుబడులు తగ్గిపోయి ధరలు పెరగడం సహజమే అయినప్పటికీ ఆ ప్రభావం పాలక పార్టీలపై పడిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ప్రజాగ్రహానికి గురైన పాలక పక్షాలు ఎన్నికలలో పరాజయం చవిచూసిన ఉదంతాలూ చోటుచేసుకున్నాయి. భారతీయ వంటలలో టమాటా, ఉల్లికి ఉన్న ప్రాధాన్యతను చెప్పాల్సిన అవసరం లేదు. వాటికి ప్రత్యామ్నాయ కూరగాయలే లేవు. మరి వాటి ధరలు పెరిగితే ప్రభుత్వాలపై ప్రభావం పడకుండా ఎలా ఉంటుంది?
టమాటాలు అధికంగా పండించే రాష్ట్రాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడులు దెబ్బతిన్నాయి. ఫలితంగా ధర అనేక రెట్లు పెరిగింది. ధరల నియంత్రణలో దారుణంగా విఫలమవుతున్న ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు టమాటా ధరలు తగ్గుతున్నప్పటికీ ఉల్లి ధరలు గృహిణుల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. మరోవైపు అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా గోధుమలు, బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మోడీ ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన మరోసారి అధికారం దక్కించుకోవాలంటే నిత్యావసరాలు, కూరగాయల ధరలు స్థిరంగా ఉండడం అవసరం. రిటైల్‌ ద్రవ్యోల్బణం పదిహేను నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఉల్లి పంటను ఎక్కువగా వేసే మహారాష్ట్రలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో దిగుబడులు బాగా పడిపోయాయి. ప్రస్తుత సీజన్‌లో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ వర్షపాతం సాధారణం కంటే 7% తక్కువగా నమోదైంది. దీంతో ధరలు పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే రాజధానిలో గోధుమల ధర 12%, బియ్యం ధర 22%, టమాటాల ధర 80%, ఉల్లి ధర 32% పెరిగింది. ప్రభుత్వ ఆంక్షలను ముందుగానే ఊహించిన కొందరు మహారాష్ట్ర రైతులు ఉల్లి సాగుకు స్వస్తి చెప్పారు. పంట విషయంలో ప్రభుత్వ జోక్యం పెరిగిపోతోందని, ఎగుమతి సుంకాన్ని విధించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయం ధరలపై ఒత్తిడి పెంచిందని వారు అంటున్నారు. దేశంలో జరిగే ఉల్లి ఉత్పత్తిలో 40% మహారాష్ట్ర నుండి వస్తున్నదే. అక్కడ సంవత్సరానికి మూడు పంటలు వేస్తారు. రెండు పంటలు వర్షాకాలంలోనూ, ఒక పంట శీతాకాలంలోనూ సాగు చేస్తారు. ఈ ఏడాది రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటి వరకూ సాధారణం కంటే 18% తక్కువగా వర్షపాతం నమోదైంది. ఇది దిగుబడులపై ప్రభావం చూపింది.