ఇంటర్‌లో చేరాలంటే రూ.500 కట్టాల్సిందే…

– ఆగస్టు 1 నుంచి ఆలస్య రుసుంతో ప్రవేశాలు
– ఇంటర్‌ బోర్డు కొత్త నిర్ణయంపై విద్యార్థుల్లో ఆందోళన
– ఉచిత విద్య అంటూనే భారాలు మోపుతున్న వైనం
– ప్రభుత్వ కాలేజీల్లో చేరికలపై తీవ్ర ప్రభావం
– పేద పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదం
– ప్రవేశాల గడువు 31 వరకు పొడిగింపు
– 30 వరకు కాలేజీలకు సెలవులే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఇంటర్‌ విద్యార్థులపై ప్రభుత్వం భారాలు మోపుతున్నది. 2023-24 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో చేరాలంటే రూ.500 కట్టాల్సిందేనని హుకుం జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చేనెల ఒకటి నుంచి ఇంటర్‌లో ప్రవేశం పొందాలంటే ఆలస్య రుసుం రూ.500 చెల్లించాలని ఆదేశించారు. ఇంటర్‌లో చేరేందుకు వచ్చేనెల 16 వరకు గడువున్నది. గతంలో ఇలాంటి నిర్ణయాన్ని ఇంటర్‌ బోర్డు ఎప్పుడూ తీసుకోలేదు. ఈ కొత్త నిర్ణయంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ విద్యను ఉచితంగా అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చెప్తున్నది. 2015-16 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజును వసూలు చేయకుండా ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నది. కానీ కాలేజీల్లో చేరాలంటే రూ.500 ఆలస్య రుసుం కట్టాలన్న నిబంధన విధించడం గమనార్హం. ఉచిత విద్య అంటూనే విద్యార్థులపై భారాలు మోపడం సరైంది కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్ణయం వల్ల ఆయా కాలేజీల్లో విద్యార్థుల చేరికలపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రవేశాలు తగ్గిపోయే అవకాశమున్నది. పేద విద్యార్థులే ప్రభుత్వ కాలేజీల్లో చేరతారు. ఈ నిర్ణయంతో కొందరు చదువుకు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. దీనిపై పునరాలోచించాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 72 వేల మంది చేరారు. వారిలో జనరల్‌ కేటగిరీ విభాగంలో 55 వేల మంది, ఒకేషనల్‌ కేటగిరీ విభాగంలో 17 వేల మంది ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అత్యధికంగా హైదరాబాద్‌-2లో 4,681 మంది, రంగారెడ్డిలో 3,654 మంది, ఆదిలాబాద్‌లో 3,209 మంది, అత్యల్పంగా 360 మంది ప్రవేశం పొందినట్టు సమాచారం.
31 వరకు ప్రవేశాల గడువు పొడిగింపు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈనెల 27 నుంచి 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను కొనసాగించాలని కోరారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థులను చేర్చుకోవాలని సూచించారు. అయితే వర్షాల నేపథ్యంలో గురువారం కాలేజీలకు సెలవున్నది.
శుక్రవారం మొహర్రం సందర్భంగా ఐచ్ఛిక సెలవు, శనివారం సాధారణ సెలవున్నది. మరుసటి రోజు ఆదివారం. దీంతో ఈనెల 31న మాత్రమే విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు అవకాశమున్నది. ప్రవేశాల గడువును పొడిగించినా అది విద్యార్థులకు ప్రయోజనం కలిగించే అవకాశం లేదు. ఆ గడువును వచ్చేనెల 15వ తేదీ వరకు పొడిగించాలని అధ్యాపక సంఘాలు ఇంటర్‌ బోర్డును కోరుతున్నాయి.
ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి టీజీజేఎల్‌ఏ ధన్యవాదాలు
రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు చేరే గడువును ఈనెల 31 వరకు పొడిగించడం పట్ల ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌కు తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ (టీజీజేఎల్‌ఏ-475) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వస్కుల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ ధన్యవాదాలు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రవేశాల గడువును పొడిగించాలంటూ ఆన్‌లైన్‌లో వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు. ఆలస్య రుసుం లేకుండా ఈనెల 31 వరకు చేరేందుకు అవకాశముందనీ, ఆ గడువును మరిన్ని రోజులు పొడిగించాలని కోరారు. రూ.500 ఆలస్య రుసుంతో వచ్చేనెల ఒకటి నుంచి 16 వరకు చేరొచ్చని సూచించారు.