నీది నాదీ ఒకే కథ!

Your story is mine!– ఆసీస్‌, శ్రీలంకకు చావోరేవో
– తొలి విజయం కోసం తహతహ
– మ|| 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

ఐసీసీ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అనూహ్య పరిస్థితి చవిచూస్తోంది. మెగా టోర్నీలో తిరుగులేని రికార్డున్న కంగారూ జట్టు ఈసారి గ్రూప్‌ దశలో వరుసగా రెండు పరాజయాలు చవిచూసింది. మరోవైపు శ్రీలంక సైతం తొలి రెండు మ్యాచుల్లో మట్టికరిచింది. సెమీఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారనున్న తరుణంలో ఇటు ఆసీస్‌, అటు శ్రీలంకకు చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. విజయమే లక్ష్యంగా నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక ఢీ కొీట్టనున్నాయి.
లక్నో (ఉత్తరప్రదేశ్‌) :

2023 వరల్డ్‌కప్‌ ఫార్మాట్‌ బలమైన జట్లు పుంజుకునేందుకు ఊతం ఇస్తాయి. గ్రూప్‌ దశ తొమ్మిది మ్యాచుల్లో ఒకట్రెండు పరాజయాలు చవిచూసినా పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదు. కానీ ఆరంభంలోనే వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి.. కచ్చితంగా కంగారు పెట్టించేదే. ఇదే పరిస్థితి ఇప్పుడు ఆస్ట్రేలియా, శ్రీలంక ఎదుర్కొంటున్నాయి. ఆస్ట్రేలియా వరుసగా భారత్‌, దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలవగా.. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ చేతిలో శ్రీలంక కంగుతింది. నేడు లక్నోలో ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడనుండగా.. ఓ జట్టు హ్యాట్రిక్‌ ఓటములు అందుకోవటం ఖాయమైంది. మూడు పరాజయాలతో ప్రపంచకప్‌ వేట షురూ చేయటం అంత సులువు కాదు. అందుకే, ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, శ్రీలంక బరిలోకి దిగుతున్నాయి.
కంగారు పడకుండా..!
ప్రపంచకప్‌లో ఆసీస్‌కు ఆరంభంలోనే కఠిన ప్రత్యర్థులు ఎదురయ్యారు. ఆతిథ్య భారత్‌, జోరుమీదున్న సఫారీలు ఆసీస్‌పై గెలుపొందాయి. ప్రపంచకప్‌ ముంగిట జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సైతం ఆస్ట్రేలియా ఈ రెండు జట్లకు సిరీస్‌లు కోల్పోయింది. ఐసీసీ ఈవెంట్‌లో ఆసీస్‌ ఈ స్థాయిలో ఒత్తిడిలో పడటం అరుదు. స్పిన్‌ అనుకూలత కనిపించే లక్నో పిచ్‌పై ఆసీస్‌కు ఆడం జంపా కీలకం కానున్నాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అంచనాలను అందుకోవటం లేదు. బ్యాట్‌తో, బంతితో మాక్స్‌వెల్‌ మ్యాజిక్‌ ఆసీస్‌కు అత్యవసరం. స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌ సైతం మిడిల్‌ ఆర్డర్‌లో ఆసీస్‌కు పెద్దగా ఉపయుక్తంగా ఉండటం లేదు. డెవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ మెరిస్తే ఆసీస్‌కు మంచి అవకాశాలు ఉంటాయి. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోశ్‌ హాజిల్‌వుడ్‌ బంతితో మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. స్వల్ప స్కోర్లు నమోదయ్యే పిచ్‌పై మార్కస్‌ స్టోయినిస్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌లు తమదైన పాత్ర పోషించేందుకు ఎదురు చూస్తున్నారు.
బంతితో తడబాటు
తొలి రెండు మ్యాచుల్లో శ్రీలంక 300 పైచిలుకు స్కోర్లు నమోదు చేసింది. కానీ బ్యాటర్ల పరుగుల వేటకు మించి బౌలర్లు పరుగులను సమర్పించుకున్నారు. సఫారీలు లంక బౌలర్లపై రికార్డుల మోత మోగించగా.. ఉప్పల్‌ స్టేడియంలో శ్రీలంకపై అత్యధిక ప్రపంచకప్‌ లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు పాకిస్థాన్‌ కైవసం చేసుకుంది. కుశాల్‌ మెండిస్‌, సదీర సమరవిక్రమ, నిశాంక, కుశాల్‌ పెరీరాలు మంచి ఫామ్‌లో ఉన్నారు. నాణ్యమైన బౌలర్లపై దూకుడుగా ఆడుతున్నారు. కానీ బౌలింగ్‌ విభాగంలో నిలకడగా నిరాశపరుస్తోంది. కసున్‌ రజిత, దిల్షాన్‌ మధుశంక సహా స్పిన్నర్లు మహీశ్‌ తీక్షణ, డునిత్‌ వెల్లలాగేలు రాణించటం లేదు. స్పిన్‌ పిచ్‌పై వెల్లలాగే, తీక్షణలపై శ్రీలంక భారీగా ఆశలు పెట్టుకుంది. డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌ మతీశ పతిరణ ‘కుడి భుజం’ గాయంతో ఆసీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేడు.
తుది జట్లు (అంచనా)
ఆస్ట్రేలియా : డెవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌ (వికెట్‌ కీపర్‌), గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), ఆడం జంపా, జోశ్‌ హాజిల్‌వుడ్‌.
శ్రీలంక : పథుం నిశాంక, కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక, ధనంజయ డిసిల్వ, డునిత్‌ వెల్లలాగే, చామిక కరుణరత్నె, మహీశ్‌ తీక్షణ, కసున్‌ రజిత, దిల్షాన్‌ మధుశంక.