నైపుణ్య లేమితో ఉపాధికి దూరంగా యువత

ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌ ఉంది. దేశ జనాభాలో సుమారు 65 శాతం జనాభా 28 సంవత్సరాల లోపు వారే అనగా ”వర్క్‌ ఫోర్స్‌” అని గణాంకాలు చెబుతున్నాయి. ఆ మాటకు వస్తే, 45శాతం జనాభా 25 సంవత్సరాల లోపు వారే. వీరందరూ భారత్‌ భవిష్యత్తును మార్చడంలో క్రియాశీలకంగా మారనున్నారు. అయితే, వీరు చదివిన చదువుకు, చేసే ఉద్యోగిని సంబంధం లేకుండా ఉండటం గమనార్హం. వారి చేసే పనికి కావలసిన నైపుణ్యాలు లేక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడం చాలా బాధాకరం. మనదేశంలో చదువులకు అకడమిక్‌ రికార్డు పరంగా మంచి మార్కులు, గ్రేడ్లు వస్తున్నా, తదుపరి వారి జీవన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునుటలో నైపుణ్యాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొరవడి నిరుద్యోగంతో బాధపడుతున్నారు. యువతలో ”చదువు (అకడమిక్‌)- నైపుణ్యాలు – నాలెడ్జ్‌” ఈ మూడు అంశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దీంతో ప్రపంచ మార్కెట్‌, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునుటలో వెనుకబడి ఉంటోంది. ఈ గ్యాప్స్‌ ఎంత త్వరగా పూడ్చడానికి చర్యలు తీసుకుంటే, అంత త్వరగా ప్రపంచ మార్కెట్లను అందిపుచ్చుకుని వారితో పాటు, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేసే అవకాశం ఉంది. సింగపూర్‌, సౌత్‌ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశాల యువతకు భవిష్యత్తు అవసరాలను తీర్చే నైపుణ్యాలు, నాలెడ్జ్‌ అందిస్తూ ప్రపంచ మార్కెట్లను అందిపుచ్చుకుని, అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండే విధంగా తర్ఫీదు ఇస్తున్నారు. అదే విధంగా, ఫిన్లాండ్‌ దేశం కూడా ఆ దేశ యువతకు వివిధ పరిశ్రమలకు అవసరమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన చదువును, నైపుణ్యాలు అందిస్తూ ”టి.వి.ఈ.టి” ద్వారా ప్రపంచ మార్కెట్లో నిలబడే విధంగా కృషి చేస్తున్నారు. ఇటువంటి దేశాల వరవడిని మనదేశ యువతకు నేటి పాలకులు, ప్రభుత్వాలు అందించాలి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో మన యువత పట్టుబిగించి, తమ తమ మేధోమథనం ద్వారా భారత ఆర్థిక అభివృద్ధికి వెన్నెముక వలే నిలబడాలి.
ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఒకేషనల్‌ శిక్షణ అభివృద్ధి పరచాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందు బాటులోకి తేవాలి. ఈ 21వ శతాబ్దంలో ఆధునిక కాలంలో ముఖ్యంగా ఆటోమిషన్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటిలి జెన్స్‌, జీ-పాట్‌ వంటి నూతన చదువులు, విధానాలు అన్నింటా ఆధిపత్యం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో మనదేశ విద్యా విధానంలో సాంకేతిక పరిజ్ఞానానికి, నైపుణ్యాల అభివృద్ధికి పెద్ద పీట వేయాలి. అంతే కానీ, కాలం చెల్లిన, మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు బలపరిచే చదువులకు చోటు ఇవ్వరాదు. సైంటిఫిక్‌ టెంపర్‌ ప్రోత్సాహించే చదువులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కోవిడ్‌ అనంతరం ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త కొత్త చదువులు, రంగాలు రంగప్రవేశం చేశాయి. ముఖ్యంగా నర్సింగ్‌, బ్యూటీ, వెల్నెస్‌, ఇంటర్‌ నెట్‌ సేవలు, ఆన్‌లైన్‌ వ్యాపారాలు, మార్కెట్లు సాప్ట్‌వేర్‌ రంగాలు, ఏనిమేషన్‌, గిగ్‌, మూన్‌ లైట్నింగ్‌, అంతరిక్ష పర్యాటకం, టూరిజం, పర్యావరణం, రెనెవబుల్‌ ఎనర్జీ ఇలా అనేక నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా మహిళలు, పురుషులు అనేక కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు అందిపుచ్చు కుంటున్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మన యువత నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్‌, టీం వర్క్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, ఇంటిలిజెన్స్‌ వంటి వాటిని ఆకలింపు చేసుకోవాలి. ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ ఇటీవల ప్రకటించిన నివేదిక ప్రకారం 2030 నాటికి భారత్‌ లో సుమారు 29 మిలియన్ల యువత నైపుణ్యలేమితో ఇబ్బంది పడుతుందని పేర్కొంది.ఇకనైనా చదివిన చదువుకు, అకడమిక్‌ పరిజ్ఞానంతో పాటు, నైపుణ్యాలు సాధించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగంలో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి బడ్జెట్లో నిధులు కేటాయింపులు పెంచాలి. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయ, అధ్యాపక ఖాళీలు భర్తీ చేయాలి. రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రంథాలయాలు, లేబరేటరీలు అభివృద్ధి పరచాలి. శాస్త్ర సాంకేతిక చదువులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని రంగాల్లో పేటెంట్‌ హక్కులు చేజిక్కించుకునే విధంగా మన విద్యావ్యవస్థ నిర్మించాలి. భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్లను మన ఆధీనంలో ఉండే విధంగా మన యువత నైపుణ్యాలు అందిపుచ్చుకొని, ఉద్యోగ ఉపాధి అవకాశాలతోపాటు, వ్యాపార రంగాల్లో సత్తా చాటాలి. 500 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపొందే క్రమంలో క్రియాశీలక పాత్ర పోషించాలి. అప్పుడు మాత్రమే మనదేశానికి వరంగా ఉన్న యువ జనాభా, భవిష్యత్తులో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరవేయగలదు.
– ఐ.పి.రావు