పండ్లలో రారాజు ఎవరంటే ఠక్కున చెప్పేయవచ్చు మామిడి అని… వేసవి కాలం వచ్చిందంటే మామిడి కాయలను, పండ్లను రుచి చూడని వారుండరు. పచ్చికాయలను, పండ్లను ఏదోక రూపంలో ఉపయోగిస్తూనే ఉంటారు. రోజూ ఒకే మాదిరిగా తీసుకునేకంటే కొంచెం వెరైటీగా టేస్టీగా మామిడిని చల్ల చల్లగా తీసుకుంటే రుచిని ఆస్వాదించడంతో పాటు, వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం కూడా పొందవచ్చు. చల్లగా వెరైటీగా చేసుకోగలిగే ఫ్రూటీలు ఈ వారం మీ కోసం…
కచ్చా మ్యాంగో ఐస్ కాండిల్ కావాల్సినవి : పచ్చిమామిడికాయ – ఒకటి, పుదీనా ఆకులు – రెండు టేబుల్ స్పూన్‌లు, బ్లాక్ సాల్ట్ – అర టీ స్ఫూన్, పంచదార – ముప్పావు కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, వెనీలా ఎసెన్స్ లేదా మ్యాంగో ఎసెన్స్ – కొద్దిగా, ఐస్ మౌల్డ్స్ బాక్స్, ఐస్ ఫ్రూట్ స్టిక్స్
తయారు చేసే విధానం : మామిడికాయ పైన ఉండే తొక్కను తీసేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి (ఒక కప్పు ముక్కలు), మిక్సి జార్‌లో వేసి రెండు స్పూన్‌ల పుదీనా ఆకులు, అర టీస్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఒకటిన్నర కప్పుల నీళ్ళను పోసి మెత్తని పేస్టులా చేయాలి. దీనిని పల్చని క్లాత్‌తో ఫిల్టర్ చేసుకోని జ్యూస్‌ను పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో ముప్పావు కప్పు పంచదార వేసి, ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేయాలి. ఇందులోనే వడకట్టి పెట్టుకున్న జ్యూస్‌ను కూడా పోసి స్టవ్ మంటను ఎడ్జస్ట్ చేసుకుంటూ పంచదార కరిగిన తర్వాత ఒక నిమిషం పాటు మరిగించాలి. ఇందులో చివరిగా పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్‌ని లేదా మ్యాంగో ఎసెన్స్‌నిగాని కలపాలి. ఫుడ్ కలర్ ఇష్టపడే వారు రెండు లేదా మూడు చుక్కలు కలర్ కలుపుకోవచ్చు. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక ఐస్ మౌల్డ్స్‌లోకి పోయాలి. అందులో ఐస్ ఫ్రూట్ స్టిక్స్ పెట్టి ఎనిమిది నుంచి పది గంటల వరకు డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత కొంచెం ఐస్ మౌల్ట్స్‌ను వాటర్‌లో పెట్టి తీసేస్తే ఈజీగా ఐస్ కాండిల్స్ వచ్చేస్తాయి.
కచ్చా మ్యాంగో ఫ్రూటీ కావాల్సినవి : పచ్చిమామిడి కాయలు – 2, పంచదార – పావుకిలో, నిమ్మ ఉప్పు – ఒక టీ స్పూన్
తయారు చేసే విధానం : మామిడికాయలు కడిగి, ప్రెషర్ కుక్కర్‌లో కాయలు మునిగే వరకు నీళ్ళు పోసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. మామిడికాయలు కాస్త చల్లారాక తొక్కు తీసేసి గుజ్జు మొత్తాన్ని మిక్సి జార్‌లో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే మామిడికాయలు ఉడికించడానికి ఉపయోగించిన నీళ్ళను మిక్సి పట్టేపుడు ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలో పావుకేజీ పంచదార తీసుకోని కొన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. పంచదార కరిగిన తర్వాత మిక్సి పట్టిన మామిడికాయ పేస్టును పంచదార పాకంలో వేసి ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూ ఐదు నిమిషాలు మరిగించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నిమ్మ ఉప్పును అందులో కలుపుకోవాలి. మరికొంచెం సేపు మరిగించి దించి, చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లో పోసి ఫ్రిజ్‌లో పదిహేను రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. కచ్చా ఫ్రూటీ రెడీ అయినట్లే… తాగాలనుకున్నప్పుడు ఒక గ్లాసులో సగం వరకు ఈ జ్యూస్‌ను పోసుకుని మిగిలిన సగం చల్లని నీటిని పోసి బాగా కలిపి తాగొచ్చు.
మ్యాంగో ఫ్రూటీ కావాల్సినవి : మామిడి పండు – 2, మామిడికాయ – 1, పంచదార – సరిపడ
తయారు చేసే విధానం : మామిడి కాయలను తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నింటిని ఒక బౌల్‌లో వేసి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసి మామిడిముక్కలు మెత్త పడే వరకూ మరిగించాలి. తర్వాత అందులో మిగిలిన నీటిని ఒక గిన్నెలోకి వంసేసుకోవాలి. ముక్కలు బాగా చల్లారాక మెత్తని పేస్టులా గ్రైండ్ చేయాలి. మామిడిముక్కల నుంచి వేరు చేసిన నీటిలోకి ఈ పేస్టును వడకట్టుకోవాలి. పీచు లాంటివి ఏమైనా వుంటే వేరవుతాయి. ఇందులో రెండు లేదా రెండున్నర గ్లాసుల నీళ్ళు కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపి ఒక జార్‌లో పోసుకోవాలి. ఒక వేళ తీపి తగ్గినట్లనిపిస్తే సరిపడా పంచదార వేసి కొంచెం నీళ్ళల్లో మరిగించి ఈ మిశ్రమంలో కలుపుకోవచ్చు. దీనిని రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత గ్లాసుల్లో పోసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.