ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌…

– నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదాపడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ప్రభుత్వం సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక, హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ మూడు రోజుల క్రితమే వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 17న నిర్ణయించిన సచివాలయ ప్రారంభోత్సవం గురించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)తో సంప్రదింపులు చేశారు. మొత్తం పరిస్థితిని వివరిస్తూ అర్జెంట్‌ మేసేజ్‌ ఫార్ములాలో సీఈసీకి లేఖ పంపారు. అలాగే స్వయంగా ఫోన్లోను మంతనాలు చేసినట్టు తెలిసింది. సచివాలయం ప్రారంభోత్సవం తేదీ ఎప్పుడు నిర్ణయమైందీ, పూర్వాపరాలను వివరిస్తూ ప్రారంభోత్సవానికి అనుమతి ఇవ్వాలని లేఖ రాసినట్టు సమాచారం. అయినా వారినుంచి వచ్చిన ప్రతిస్పందన ఆశాజనకంగా లేకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రారంభోత్సవ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలియజేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి సీపీఆర్వో కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
మరో నెల సమయం..
కొత్త సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో రాష్ట్రమంతా చర్చ జరుగుతున్న విషయం విదితమే. నాలుగు రోజులక్రితం కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి కారణం తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్‌ అంటూ లీకులు ఇవ్వడం, మీడియాలో రావడం మినహా సంబంధిత మంత్రి లేదా రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దాదాపు 11 ఫైరింజన్లు మంటలను ఆర్పేశాయి. ఒకటో అంతస్థులో జరిగిన షార్ట్‌ సర్క్యూట్‌తో ప్లాస్టిక్‌ వస్తువులకు అంటుకుని భవనమంతా మంటలు రేగాయనీ, దీంతో బిల్డింగ్‌ మొత్తం పొగసూరిందనే ప్రచారం జోరుగా సాగింది. ఒకానొక సందర్భంలో మాక్‌డ్రిల్‌ అంటూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అసెంబ్లీ లాబీల్లో మీడియాతో అన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. నూతన సచివాలయ భవన నిర్మాణంలో అన్ని విషయాలూ తానై చూసుకుంటున్న సీఎం కేసీఆర్‌గానీ, ఆయన మంత్రివర్గంలోని కీలకమైన సహచరులు గానీ ఎక్కడా మాట్లాడకపోవడం గమనార్హం. మీడియాను లోపలికి అనుమతించలేదు. పోలీస్‌ గస్తీ పెంచారు. లోపల జరిగిన అగ్ని ప్రమాదం గురించి సమాజానికి ఎక్కువ విషయాలు తెలియకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. షార్ట్‌సర్క్యూట్‌తో భవనం లోపలిభాగంలో పొగసూరిందంటూ పెయింట్‌ వేసి కవర్‌ చేశారు. అయితే అగ్ని ప్రమాదం కారణంతో భవనంలోని కీలకమైన అంతస్థులో ఒకవైపు భాగాన్ని పూర్తితొలగించాల్సి వచ్చిందనే ప్రచారమూ ఉంది. అయితే ప్రచారాన్ని రోడ్లు, భవనాలశాఖ అధికారులు, నిర్మాణ సంస్థ కూడా ఖండిస్తున్నాయి. అసలు విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. ఈ నెల 17న జరిగే ప్రారంభోత్స వానికి సిద్ధం చేసే పనిలో అటు రోడ్లు ,భవనాల శాఖ , ఇటు వర్కింగ్‌ ఏజెన్సీ షాపూర్జీ పల్లోంజీ సంస్థా ఉన్నట్టు తెలిసింది. ఈలోపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం, అలాగే ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించడం రెండూ సమాంతరంగా జరిగాయి. దీంతో ప్రారంభోత్సవ కార్యక్ర మాన్ని వాయిదా వేయకతప్పలేదనే వ్యాఖ్యానాలు వినిపి స్తున్నాయి. అగ్ని ప్రమాదాన్ని మీడియా కంటపడకుండా సర్కారు అడ్డుకోవడంపై ఒకింత అసహనం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్‌ మూలంగా దాదాపు మరో నెల సమయం రోడ్లు, భవనాల శాఖకు చిక్కి నట్టయింది. సచివాలయం పనులు దాదాపు పూర్త య్యాయనీ అంటున్నా, ఒకటి, రెండు, మూడు అంతస్తుల్లో పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిసింది. దాదాపు 95 శాతానికి పైగా పనులు ఇప్పటికే పూర్తిచేశామని చెబుతున్నా, అంతర్గతంగా చేయాల్సిన కీలకమైన పనులు మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు సమాచారం. కాగా ఇప్పుడు ప్రారంభోత్సవం వాయిదా పడిన నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా పనులను పూర్తిచేసేందుకు వర్కింగ్‌ ఏజెన్సీ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అలాగే ఈ భవనాన్ని పూర్తిచేసే వరకు మరే ఇతర కాంట్రాక్టు పనులు షాపూర్జీ-పల్లోంజీ సంస్థకు ఇచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు ఆర్‌అండ్‌బీలో చర్చ జరుగుతున్నది.

Spread the love