కార్లు వచ్చేశాయ్‌

– హైదరాబాద్‌లో ఈ రేసింగ్‌ కార్లు
– ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ రేసు
– షరవేగంగా సాగుతున్న ఏర్పాట్లు
       హైదరాబాద్‌ నగరం అంతర్జాతీయ రేసింగ్‌ చిత్రపటంలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఎఫ్‌ఐఏ ఏబీబీ ఫార్ములా ఈ రేసుకు హైదరాబాద్‌ ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 11న మెగా రేసు నేపథ్యంలో 11 జట్ల ఎలక్రిక్‌ రేసింగ్‌ కార్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఆధునాతన జనరేషన్‌ 3 ఎలక్రిక్‌ రేసింగ్‌ కార్లు శుక్రవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. రేసింగ్‌ కార్ల కోసం గ్రీన్‌కో అత్యాధునిక గ్యారేజ్‌లు సిద్ధం చేసింది. రేసింగ్‌ కార్లు నగరానికి చేరుకోవటంతో హైదరాబాద్‌ ఫార్ములా ఈ ప్రీ సందడికి కౌంట్‌డౌన్‌ మొదలైంది.
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఇక్కడ ఇదే ప్రథమం
అంతర్జాతీయ రేసింగ్‌ మ్యాప్‌లో హైదరాబాద్‌ చోటు సాధించటం ఓ మైలురాయి. ఇప్పటివరకు ఎఫ్‌ఐఏ భారత్‌లో జరుగలేదు. ఫార్ములా ఈ రేసు ఇప్పటివరకు 8 సీజన్లు ముగించుకుంది. తొమ్మిదో సీజన్‌కు హైదరాబాద్‌ గ్రాండ్‌ప్రీ చోటు దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్‌కో సంయుక్తంగా ఫార్ములా ఈ రేసును నిర్వహిస్తున్నాయి. ఫార్ములా ఈ చరిత్రలోనే తొలిసారి హైదరాబాద్‌ నగరంలో ఈ రేసు జరుగనుంది. తాజా రేసుతో పాటు వచ్చే నాలుగేండ్ల పాటు హైదరాబాద్‌ ఈ రేసు జరుగనుంది. ఆదరణ లభిస్తే హైదరాబాద్‌ ఫార్ములా ఈ రేసు శాశ్వత వేదికగా నిలిపోయే అవకాశాలు సైతం ఉన్నాయి. ఎఫ్‌ఐఏ ఏబీబీ ఫార్ములా ఈ రేసు హైదరాబాద్‌లో జరుగనుండటం తెలంగాణకు, భారత దేశానికి గర్వకారణం. భారత మోటార్‌స్పోర్ట్స్‌లో ఇదో మరుపురాని మైలురాయిగా నిలిచిపోనుంది.
11 జట్లు, 22 మంది డ్రైవర్లు
హైదరాబాద్‌ మోటార్‌స్పోర్ట్స్‌ ప్రియులకు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌) రూపంలో రేసు మజాను రుచి చూశారు. ఇప్పుడు ఎఫ్‌ఐఏ ఏబీబీ ఫార్ములా ఈ అంతకుమించి ఉండబోతుంది. అంతర్జాతీయ ఈ రేసింగ్‌ దిగ్గజ జట్లు ఇందులో పోటీపడుతున్నాయి. 11 జట్ల నుంచి ఇద్దరు చొప్పున డ్రైవర్లు ట్రాక్‌పై స్పీడ్‌ చూపించనున్నారు. స్వదేశీ రేసింగ్‌ దిగ్గజం ‘మహీంద్ర రేసింగ్‌’ సొంతగడ్డపై తొలిసారి బరిలోకి దిగుతుంది. జాగ్వార్‌, మసరెటి, నియో, మెక్‌లారెన్‌, నిసాన్‌, పోర్చ్సే వంటి దిగ్గజ రేసింగ్‌ కార్లను హైదరాబాద్‌ ఈ రేసులో చూడవచ్చు.
జనరేషన్‌ 3 ఈ కారు ఆవిష్కరణ
హైదరాబాద్‌ ఫార్ములా ఈ రేసుకు మరో ప్రత్యేకత ఉంది. హైదరాబాద్‌ రేసు సందర్భంగా ఫార్ములా ఈ థర్డ్‌ జనరేషన్‌ ఎలక్రిక్‌ కారును ఆవిష్కరించనున్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ కారు.. ఈ విభాగంలో అత్యంత తేలికైన, అత్యంత వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన, అత్యుత్తమ ఎలక్రిక్‌ కారు.
టికెట్‌ లేకపోయినా.. చూడొచ్చు!
హైదరాబాద్‌ ఫార్ములా ఈ రేసు టికెట్లు దాదాపుగా అమ్ముడయ్యాయి. రూ.1000 నుంచి రూ.1,25,000 వరకు టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. టికెట్‌ కొనుగోలు చేయని వారి కోసం నిర్వాహకులు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నాం ప్రధాన రేసు ఈవెంట్‌ జరుగనుంది. అయితే, ఫిబ్రవరి 10న సాయంత్రం 4.25 గంటలకు ప్రాక్టీస్‌ సెషన్‌ ఆరంభం అవుతుంది. ఫిబ్రవరి 11న ఉదయం 8.05 గంటలకు రెండో ప్రాక్టీస్‌ సెషన్‌ ఉంటుంది. ఈ రెండు ప్రాక్టీస్‌ సెషన్లకు టికెట్‌ లేకపోయినా అనుమతించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ప్రకటన చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం ప్రాక్టీస్‌ సెషన్‌ 8.55 నిమిషాలకు ముగుస్తుంది. ప్రాక్టీస్‌ సెషన్‌ వరకు టికెట్‌ లేకపోయినా స్టాండ్స్‌లోకి వెళ్లి ఈ రేసు మజాను ఆస్వాదించవచ్చు.
రోజంతా కిక్కే కిక్కు.!
ఫార్ములా ఈ రేసు ఈవెంట్‌ అనగానే పూర్తిగా రేసు మాత్రమే ఉండదు. అంతకుమించి ఉండబోతుంది. ప్రధాన ఈవెంట్‌కు సమాంతరంగా రోజంతా ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ రేసులో ఫ్యాన్‌ విలేజ్‌ ప్రత్యేకం. ఇక్కడ లైవ్‌ మ్యూజిక్‌, గేమింగ్‌ ఏరియా, ఆటోగ్రాఫ్‌ సెషన్‌, కిడ్స్‌ ఏరియా, రోమింగ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌తో పాటు అంతర్జాతీయ, స్థానిక వంటకాలు, దేశ విదేశీ మద్యం అందుబాటులో ఉంచనున్నారు. ఫ్యాన్‌ ఫెస్టివల్‌ను ఎఫ్‌ఐఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుం టుంది. ఇందుకోసం లుంబిని పార్కు పక్కన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
షరవేగంగా ఏర్పాట్లు
అంతర్జాతీయ ఈవెంట్‌కు హైదరాబాద్‌ షరవేగంగా ముస్తాబవుతోంది. గతంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌కు ఏర్పాట్లు చేసినా.. ఎఫ్‌ఐఏ ప్రమాణాలకు అనుగుణంగా నూతన నిర్మాణాలు చేపట్టారు. 11 జట్ల కార్లు ఉంచేందుకు గ్యారేజ్‌లు శాశ్వత నిర్మాణాలు. వీటిని గ్రీన్‌కో సంస్థ తయారు చేసింది. మిగతా నిర్మాణాలు తాత్కాలికం. ప్రపంచ శ్రేణి రేసింగ్‌ ఈవెంట్‌ అనుభూతి ఇవ్వటం కోసం ఎక్కడా రాజీపడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్‌కు మరో ఆరు రోజుల సమయమే ఉండటంతో నిర్వాహకులు సమయంతో పోటీపడుతూ ఏర్పాట్లలో నిమగం అయ్యారు.

రానున్న ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు!
ఎఫ్‌ఐఏ ఏబీబీ ఫార్ములా ఈ రేసులో అరంగేట్రం చేయనున్న హైదరాబాద్‌ ఈ ప్రీకి అంతర్జాతీయ ఆటోమైబైల్‌ సమాఖ్య అధ్యక్షుడు హాజరుకానున్నారు. డిసెంబర్‌ 2021లో ఎఫ్‌ఐఏ అధ్యక్షుడిగా మహ్మద్‌ బిన్‌ సులేయం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌ ఈవెంట్‌లోనే థర్డ్‌ జనరేషన్‌ ఎలక్రిక్‌ రేస్‌ కారు ఆవిష్కరణ కానుండటంతో మహ్మద్‌ బిన్‌ సులేయం ఫిబ్రవరి 11 రేసుకు రానున్నట్టు తెలుస్తుంది. నిర్వాహకులు ఇదివరకే ఎఫ్‌ఐఏ అధ్యక్షుడికి ఆహ్వానం పంపించారు. అంతర్జాతీయ, దేశీయ మోటార్‌స్పోర్ట్స్‌ ఉన్నతాధికారులతో కలిసి మహ్మద్‌ బిన్‌ సులేయం హైదరాబాద్‌ ఈవెంట్‌కు హాజరు కానున్నట్టు సమాచారం.