మన ఊరు-మనబడి అమలుకు నిధులేవీ?

– గత బడ్జెట్‌ వివరాలే మళ్లీ ప్రస్తావన
– విద్యకు రూ.19,051 కోట్లు కేటాయింపు
– గతేడాది కంటే 0.32 శాతం పెరుగుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యారంగానికి స్వల్పంగా ఊరట లభించింది. 2023-24 బడ్జెట్‌లో విద్యకు రూ.190,51.25 (6.56 శాతం) కోట్లు కేటాయించింది. ప్రస్తుత (2022-23) బడ్జెట్‌లో ఆ రంగానికి రూ.16,043 (6.24 శాతం) కోట్లు ప్రతిపాదించింది. అంటే గత బడ్జెట్‌ కంటే ఇప్పుడు రూ.3,008 (0.32 శాతం) నిధులు పెరగడం గమనార్హం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు-మనబడి పథకానికి నిధుల కేటాయింపే చేయలేదు. గతేడాది బడ్జెట్‌లో చెప్పిన అంకెలనే మళ్లీ ప్రస్తావించడం గమనార్హం. ‘రాష్ట్రవ్యాప్తంగా 26,065 పాఠశాలల్లో మూడు దశల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం రూ.7,289 కోట్లు కేటాయించింది. మొదటి దశలో భాగంగా 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. వీటిలో ఇప్పటికే చాలా స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ఊరూరా ఉత్సవంలా సంబురంగా ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నారు.’అంటూ ప్రభుత్వం ప్రకటించింది. కానీ 2023-24 విద్యాసంవత్సరం రెండోదశలో ఎన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో స్పష్టత ఇవ్వలేదు. ఆ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేందుకు నిధులను కేటాయించకపోవడం గమనార్హం. కొఠారి కమిషన్‌ సిఫారసుల ప్రకారం విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలి. ఆ లెక్కన రూ.87,118.8 కోట్లు ప్రతిపాదించాలి. విద్యకు 24 శాతం, వైద్యానికి 12 శాతం నిధులు కేటాయించాలంటూ తెలంగాణ పౌర స్పందన వేదిక (టీపీఎస్వీ) విశ్వవిద్యాలయాలు, పలు విద్యాసంస్థల్లో సంతకాల సేకరణ చేపట్టింది. దీని ప్రకారం చూసినా రూ.69,695.04 కోట్లు కేటాయించాలి. విద్యకు కనీసం 20 శాతం నిధులు కేటాయించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ లెక్కన అయినా రూ.58,079.2 కోట్లు ప్రతిపాదించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోలేదు. మొత్తం బడ్జెట్‌ రూ.2,90,396 కోట్లలో విద్యకు కేవలం రూ.19,051 (6.56 శాతం) నిధులు మాత్రమే కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.16,050.4 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,541.74 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.459.25 కోట్లు ప్రతిపాదించింది. 2014-15లో మొత్తం బడ్జెట్‌ రూ.1,00,637 ప్రతిపాదించగా, విద్యారంగానికి రూ.10,956 (10.88 శాతం) కేటాయించింది. ఈ లెక్కన చూసినా 2023-24 బడ్జెట్‌లో రూ.31,595.08 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించలేదు. ఏటా విద్యారంగానికి నిధుల కేటాయింపులను తగ్గిస్తూ వస్తున్నది. ఈసారి మాత్రం స్వల్ప ఊరటనిస్తూ గతేడాది కంటే 0.32 శాతం నిధులను పెంచింది. 2014-15లో 10.88 శాతం, 2015-16లో 9.69 శాతం, 2016-17లో 8.23 శాతం, 2017-18లో 8.49 శాతం, 2018-19లో 7.61 శాతం, 2019-20లో 6.76 శాతం, 2020-21లో 6.63 శాతం, 2021-22లో 6.76 శాతం, 2022-23లో 6.24 శాతం, ఇప్పుడు 2023-24లో 6.56 శాతం నిధులను కేటాయించింది.